గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

Mamatha Reddy
ఈ రోజుల్లో గూగుల్ వాడటం అనేది ప్రతి ఒక్కరికీ సర్వసాధారణం అయిపోయింది. తెలియని ఏ విషయం అయినా గూగుల్ లో వెతికి వెంటనే తెలుసుకోవడం అలవాటు గా మారిపోయిన ఈ రోజుల్లో గూగుల్ వాయిస్ ని కూడా తీసుకు వచ్చి వెతికే ప్రక్రియ ను మరింత సులభతరం చేసింది గూగుల్. అయితే ఈ గూగుల్ లో మనకు వినిపించే ఒక అమ్మాయి గొంతు ఎవరిదో తెలుసా.. చెవులకు ఇంపుగా వినిపించే ఆ గొంతుక మన తెలుగు అమ్మాయిదే అని చాలా తక్కువ మందికి తెలుసు. గూగుల్ గురువు కి తన గళాన్ని అరువిస్తున్న ఆ తెలుగమ్మాయి గ్రీష్మ రెడ్డి.
కర్నూల్ లో పుట్టి పెరిగిన గ్రీష్మ రెడ్డి చెన్నైలో ఓ కళాశాలలో బయోటెక్నాలజీలో బీటెక్ చదివింది. ఆ తర్వాత సివిల్స్ ప్రయత్నాలు కోసం ఢిల్లీకి వెళ్లగా అక్కడ ఆమె ఆలోచన మారింది. ఎంబీఏలో చేరింది. తర్వాత ఎమ్మెస్ సైకాలజీ చేసింది.  ఓ స్నేహితురాలి ద్వారా వాయిస్ ఓవర్ రంగం గురించి తెలిసింది. దానిపైకి మనసు మళ్ళింది. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. మాట్లాడడం అంటే ఇంకా ఇష్టం. అందుకే డబ్బింగ్ ఎలా చెబుతారు అన్న ఆసక్తి ఆమెలో ఉండేది. అందుకేనేమో వాయిస్ ఓవర్ గురించి తెలియగానే అటుగా అడుగులు వేశాను అంటుంది గ్రీష్మ.
తన గళంలో అన్ని రకాల హావభావాలు కలిగించగల నేర్పును తన సొంతం చేసుకుంది. ఢిల్లీలో కోర్సు పూర్తయిన తర్వాత వాయిస్ ఓవర్ ని కెరీర్ గా మలుచుకుంది గ్రీష్మ. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు పనిచేసే అవకాశం దొరకబుచ్చుకుంది. ఇప్పుడు ఉన్న చాలా బ్యాంకుల ప్రకటనలకు డబ్బింగ్ చెప్పింది గ్రీష్మ.. ఎంచుకున్న రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న గ్రీష్మ ఓ రోజూ గూగుల్ నుంచి కబురు వచ్చింది. గూగుల్ ట్రాన్స్ లేటర్ తో గొంతు కలిపే అవకాశం చిక్కింది. వెంటనే ఒప్పుకుంది.రెండేళ్ల కిందట గూగుల్ గడప తొక్కింది. అప్పటి నుంచి వేల తెలుగు పదాలు పలికింది. వందల కథనాలు చదివింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం భాషల్లో నూ ఆమె ప్రభుత్వ ప్రకటనలకు పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: