ప్రభాస్ సినిమాలకి ఏమయింది.. ఈ సారి సలార్ యూనిట్ కి యాక్సిడెంట్ !

Chaganti
ప్రభాస్ సినిమాలకు సంబంధించి వరుస ప్రమాదాలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి. నిన్న సాయంత్రం సమయంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష్ సెట్ లో అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. నిజానికి నిన్న ఉదయమే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. షూటింగ్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం వేసిన గ్రీన్ మ్యాట్ సెట్టింగ్ అంతా అగ్నికి ఆహుతి అయింది. అయితే ప్రమాద సమయంలో సెట్ కార్మికులు తప్ప సినిమా నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులు గాని లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. 

అయితే ఇది జరిగిన కాసేపటికి అంటే నిన్న రాత్రి సమయంలో సలార్ సినిమాకి సంబంధించిన యూనిట్ కి ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో జరుగుతోంది. ఈ సినిమా యూనిట్ కి నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గోదావరి ఖని -  శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద యూ టర్న్ తీసుకుంటున్న యూనిట్ వ్యాన్ ని వేగంగా వచ్చిన లారీ ఢీ కొన్నట్లు సమాచారం అందుతోంది.  

ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినా పలువురు యూనిట్ సభ్యులకు తీవ్ర గాయాలు కాగా వారందరినీ మమత ఆసుపత్రికి తరలించారు. ఇలా రెండు ప్రమాదాలు వెంట వెంటనే జరగడంతో అసలు ప్రభాస్ సినిమాలకి ఏమైనా దిష్టి తగిలిందా అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది పురుష్ సినిమాని ఓం రౌత్ అనే దర్శకుడు తెరకేక్కిస్తుండగా సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడం గమనార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: