హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2010 - 2020 : అనుకరణ నుండి ఆలంబన స్ధాయికి టాలీవుడ్ దూకుడు !

Reddy P Rajasekhar

గత దశాబ్ద కాలంలో టాలీవుడ్ అటు బడ్జెట్ల విషయంలోను, సరికొత్త కథల విషయంలోను ఒక్కో మెట్టు ఎదగటంతో పాటు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలు అనుకరణ స్థాయి నుండి ఆలంబన స్థాయికి ఎదిగాయి. ఒకప్పుడు టాలీవుడ్ దర్శకులు ఇతర భాషల సినిమాలను అనుకరించి సినిమాలు ఫ్రీమేక్ లేదా రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్, మల్లూవుడ్, శాండల్ వుడ్ తెలుగు సినీ పరిశ్రమ సినిమాల వైపు చూస్తున్నాయి. 
 
గత దశాబ్ద కాలంలో ఎన్నో తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. రాజమౌళి సునీల్ కాంబినేషన్లో 2010 సంవత్సరంలో విడుదలైన మర్యాద రామన్న అజయ్ దేవగణ్ హీరోగా సన్ ఆఫ్ సర్దార్ పేరుతో బాలీవుడ్ లో విడుదలై ఘన విజయం సాధించింది. రామ్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన కందిరీగ సినిమా వరుణ్ ధావణ్ హీరోగా మైన్ తేరా హీరో పేరుతో బాలీవుడ్ లో విడుదలై ఘన విజయం సాధించింది. 
 
2017 సంవత్సరంలో టాలీవుడ్ లో విడుదలై ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో విడుదలై ఘన విజయం సాధించటంతో 275 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించింది. కిక్ రీమేక్, విక్రమార్కుడు రీమేక్, ఒక్కడు రీమేక్ కూడా గత దశాబ్ద కాలంలో బాలీవుడ్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి తమిళంలో అదిత్య వర్మ పేరుతో రీమేక్ అయింది. గత దశాబ్ద కాలంలో హిందీ, ఇతర భాషల్లో తెలుగు శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు కూడా భారీగా క్రేజ్ ఏర్పడింది. 
 
తెలుగులో అబవ్ యావరేజ్ హిట్ అయిన సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్ కు 264 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బాలీవుడ్ లో తెలుగు సినిమా డిజిటల్ రైట్స్ కోటి రూపాయల నుండి 20 కోట్ల రూపాయల వరకు పలుకుతున్నాయి. బాలీవుడ్ లో బార్క్ రేటింగ్స్ లో చాలా సందర్భాల్లో బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే టాలీవుడ్ సినిమాలే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఈగ, బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఇతర భాషల్లో విడుదలై తెలుగు సినిమా స్థాయి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాయి. బాహుబలి సిరీస్ తో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా బాలీవుడ్ మార్కెట్ లో అక్కడి స్టార్ హీరోలకు ధీటుగా 130 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిందంటే తెలుగు సినిమా ఏ స్థాయికి ఎదిగిందో అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: