హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మాధవరెడ్డి అడ్డాలో ‘కారు’ జోరు కొనసాగుతుందా?

ఎలిమినేటి మాధవరెడ్డి...ఈ పేరు తెలియని టీడీపీ కార్యకర్త ఉండరు. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవలు చేసిన నాయకుడు. తెలంగాణలో టీడీపీకి పిల్లర్ మాదిరిగా నిలబడిన నేత. నల్గొండ జిల్లా భువనగిరి ఈయన సొంత నియోజకవర్గం. 1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేశారు. ఇక ఈయన హఠాన్మరణంతో..ఉమా మాధవ రెడ్డి టీడీపీలోకి వచ్చారు. మాధవరెడ్డి భార్య అయిన ఉమా...2000 ఉపఎన్నికలో, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు.
అయితే రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఏమైందో చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ కనుమరుగు కావడంతో భువనగిరిలో వరుసగా టీఆర్ఎస్ జెండా ఎగురుతూ వస్తుంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఫైళ్ళ శేఖర్ రెడ్డి విజయం సాధిస్తూ ఉన్నారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శేఖర్..భువనగిరిలో తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. తన రెండు పర్యాయాల్లో నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ పథకాలు అమలులో ముందున్నారు.
అయితే ఇక్కడ వరి రైతులు ఇబ్బందుల్లోనే ఉన్నారు. అలాగే రూరల్ ప్రాంతాల్లో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. పూర్తి స్థాయిలో రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అలాగే తాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వారి సమస్యలని తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.
రాజకీయంగా చూస్తే భువనగిరిలో టీఆర్ఎస్‌ స్ట్రాంగ్‌గానే ఉంది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ కూడా పికప్ అవుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన కుంబం అనిల్ కుమార్ రెడ్డి 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఈయన యాక్టివ్ గానే పనిచేస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో శేఖర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మరి చూడాలి మాధవరెడ్డి కోట అయిన భువనగిరిలో ఈ సారి కారు జోరు కొనసాగుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: