హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ద్వారంపూడికి జగన్ ఛాన్స్ ఇస్తారా?

తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో దూకుడుగా ఉండే నాయకుల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకరు. కాకినాడ సిటీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారంపూడి దూకుడు ఏంటో, కాకినాడ ప్రజలకు బాగా తెలుసు. ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్లు ఇచ్చే ద్వారంపూడి ప్రజలకు సేవ చేయడంలో కూడా ముందున్నారు. జగన్‌కు సన్నిహితుడు కావడంతో తూర్పు గోదావరి జిల్లాలో ద్వారంపూడి పెత్తనం ఎక్కువే ఉంటుంది.
అలాగే ఆయన తన నియోజకవర్గానికి నిధులు రాబట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. కాకినాడ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగా గ్రామ/ వార్డు సచివాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం, అండర్ డ్రైనేజ్ పనులు, సి‌సి రోడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయితే జిల్లాలో ఎంతమంది బడా నాయకులు ఉన్నా సరే ద్వారంపూడి హవానే వేరు. ఇక తనదైన శైలిలో దూసుకుపోతున్న ద్వారంపూడి, మంత్రి పదవి ఆశించే వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి జగన్ ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తున్నారు. కానీ ఇప్పటికే రెడ్డి వర్గంలో ఎక్కువ పోటీ ఉంది. కాబట్టి మంత్రి పదవి కాస్త డౌటే. ఇక రాజకీయంగా చూసుకుంటే ద్వారంపూడి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. కానీ ఇక్కడ వైసీపీ నాయకుల అక్రమాలు ఎక్కువయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పైగా ఒకసారి చంద్రబాబు, పవన్‌లని ద్వారంపూడి తీవ్రంగా దూషించారు. దీంతో టి‌డి‌పి, జనసేన వర్గాలు ద్వారంపూడిపై గుర్రుగా ఉన్నాయి.
నెక్స్ట్ ఎలాగైనా ద్వారంపూడిని ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలు గనుక కలిస్తే ద్వారంపూడికి చెక్ పడటం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ద్వారంపూడికి టి‌డి‌పి నేత వనమాడి వెంకటేశ్వరావుపై 14 వేల మెజారిటీ వచ్చింది. అదే సమయంలో ఇక్కడ జనసేనకు 30 వేల ఓట్లు పడ్డాయి....ఇక దీన్ని బట్టి చూసుకుంటే టీడీపీ-జనసేనలు కలిస్తే ద్వారంపూడి స్పీడుకు బ్రేకులు పడే అవకాశం ఉందని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: