హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: తోపుదుర్తికు పరిటాల చెక్ పెట్టేస్తారా?

 గత ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదైన నియోజకవర్గాల్లో రాప్తాడు కూడా ఒకటి. రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ అడ్డా..ఇక్కడ ఆ ఫ్యామిలీకి తిరుగులేదు. అయితే 2019 ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిసారి పరిటాల వారసుడు శ్రీరామ్ ఎన్నికల బరిలో దిగారు. అటు వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీలోకి దిగారు. జగన్ వేవ్‌లో శ్రీరామ్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. తొలిసారి తోపుదుర్తి, పరిటాల ఫ్యామిలీకి చెక్ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు.

 
ఇలా పరిటాల ఫ్యామిలీపై భారీ మెజారిటీతో గెలిచిన తోపుదుర్తిపై రాప్తాడు ప్రజలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా ప్రకాష్ పనిచేస్తున్నారా? అంటే గొప్పగా కాకపోయినా పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. అయితే పార్టీలకు అతీతంగా ప్రకాష్, పథకాలు అందిస్తున్నారు.
అలాగే రాప్తాడులో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. అలాగే కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రైతు బజార్లు, వాటర్ ట్యాంకులు, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరగడం, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. అంటే ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి తప్ప, ఇక్కడ కొత్తగా ప్రకాష్ ముద్ర ఏమి కనిపించడం లేదు. అలాగే ప్రజలకు ప్రకాష్ బాగానే అందుబాటులో ఉంటున్నారు. ఇక ఇక్కడ తాగు, సాగు నీరు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అటు రోడ్లు పరిస్తితి కూడా దారుణంగా ఉంది. కొన్ని గ్రామాల్లో రోడ్ల సౌకర్యం కూడా సరిగ్గా లేదు.
అటు నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల అక్రమాలు పెరిగిపోయాయని పరిటాల శ్రీరామ్ విమర్శిస్తున్నారు. భూములు కొనాలన్న, అమ్మాలన్న ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కప్పం కట్టాలని, ఇక ఇళ్ల స్థలాల్లో లెక్కలేని విధంగా అక్రమాలు జరిగాయని శ్రీరామ్ ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయంగా శ్రీరామ్ నిదానంగా బలపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరో రెండేళ్లలో శ్రీరామ్ పికప్ అయితే ప్రకాష్‌కు చెక్ పడే అవకాశాలు ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: