హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సాయిరెడ్డికి మీనాక్షి నాయుడు చెక్ పెట్టగలరా?

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం...తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన నియోజకవర్గం. అది కూడా 2009 వరకే. 1983 నుంచి 2009 వరకు ఇక్కడ టీడీపీ మంచి విజయాలే నమోదు చేసింది. పైగా టీడీపీ తరుపున మీనాక్షి నాయుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009 వరకు మీనాక్షి నాయుడుకు నియోజకవర్గంలో తిరుగులేదనట్లే పరిస్తితి ఉండేది. కానీ వైసీపీ తరుపున వై. సాయి ప్రసాద్ రెడ్డి బరిలో దిగుతున్న దగ్గర నుంచి పరిస్తితి మారిపోయింది.
సాయిప్రసాద్ రెడ్డి 2004లో ఆదోనిలో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి మీనాక్షి నాయుడుపై విజయం సాధించారు. ఇక 2009లో మాత్రం మీనాక్షి నాయుడుదే పైచేయి అయింది. సాయిరెడ్డి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. సాయిప్రసాద్ వైసీపీలోకి వచ్చాక వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో సాయిప్రసాద్ తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందున్నారు. అలాగే జగనన్న కాలనీల పేరిట ఆదోనిలో పేదలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వం తరుపున ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఆదోనిలో జరుగుతుంది. అలాగే జగన్ ప్రభుత్వం, ఆదోని నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేసింది.
అయితే ఆదోనిలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆదోని మార్కెట్ యార్డు రోడ్డు అధ్వాన్నంగా ఉంది. అటు ఆదోనిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది...బైపాస్ రోడ్డు పనులు త్వరగా చేపట్టాల్సిన అవసరముంది. అలాగే డ్రైనేజ్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అటు తాగునీటి సమస్య కూడా ఉంది. ఇక ప్రజా సమస్యలపై టీడీపీ నేత మీనాక్షి నాయుడు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ప్రజల మధ్యలోనే ఉంటూ, అధికార వైసీపీపై పోరాడుతున్నారు.
ప్రస్తుతానికి రాజకీయంగా చూసుకుంటే ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ బలంగానే ఉన్నారు. కానీ మీనాక్షి నాయుడు నిదానంగా పుంజుకుంటున్నారు. పైగా రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి కూడా ఎక్కువ ఉంది. కాబట్టి సాయిప్రసాద్ అలెర్ట్‌గా ఉండకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో చెక్ పడిపోయే ఛాన్స్ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: