హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాంత్‌కు ఛాన్స్ లేనట్లే...!

కడప జిల్లా అంటేనే వైఎస్సార్సీపీ అడ్డా...ఆ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గం అధికార వైసీపీకి కంచుకోట....ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి చాలా ఏళ్ళు అయిపోయాయి. అసలు రాయచోటిలో టీడీపీ కేవలం రెండుసార్లు గెలవగా, అది కూడా 1999, 2004 ఎన్నికల్లోనే టీడీపీ జెండా ఎగరగా, అక్కడ నుంచి ఇక్కడ టీడీపీకి విజయం దక్కలేదు. ఇక భవిష్యత్‌లో కూడా ఇక్కడ టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉన్నట్లు కనిపించడం లేదు.
2009 ఎన్నికల నుంచి రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డికి తిరుగులేకుండా పోయింది. 2009లో కాంగ్రెస్, 2012, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున శ్రీకాంత్ విజయం సాధించారు. ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేస్తూ, జగన్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అటు ప్రభుత్వం తరుపున ఎప్పటికప్పుడు ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు చెక్ పెడుతూనే, ఇటు ఎమ్మెల్యేగా రాయచోటిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, నాడు-నేడు ద్వారా పాఠశాలని అభివృద్ధి చేయడం, జగనన్న కాలనీల ద్వారా పేద ప్రజలకు కొత్త ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. తాజాగా రాయచోటిలో 69 లక్షల నిధులతో ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అలాగే నియోజకవర్గంలో కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇక ప్రతి ప్రభుత్వ పథకం లబ్దిదారులకు అందేలా చేస్తున్నారు.
ఇలా అన్నీ విషయాల్లో శ్రీకాంత్ రెడ్డి దూసుకెళుతూ రాయచోటిలో ప్రత్యర్ధులకు అందనంత ఎత్తులో ఉన్నారు. దీని బట్టి చూస్తే రాయచోటిలో శ్రీకాంత్ ఓడిపోయే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీకి పెద్ద ఉనికి ఉన్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రమేష్ రెడ్డి పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. మొత్తానికైతే రాయచోటిలో శ్రీకాంత్‌కు తిరుగులేదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: