హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ ఎమ్మెల్యే దెబ్బకు టీడీపీ కనుమరుగైపోతుందా?
కృష్ణా జిల్లాలో టీడీపీకి మంచి పట్టున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. అయితే 2019 నుంచి పరిస్తితి మారిపోయింది. జగన్ దెబ్బకు జిల్లాలో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హవా ఎక్కువగా ఉంది.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించారు గానీ, కొన్ని కారణాల వల్ల ఆయనకు పదవి రాలేదు. ఇక ఎమ్మెల్యేగా మాత్రం నూజివీడు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు.
అటు సంక్షేమ పథకాలు అమలులో ముందున్నారు. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ టీడీపీ తరుపున ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ముద్దరబోయిన టీడీపీ తరుపున పోటీ చేసి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయాక నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. అటు పార్టీ కేడర్ కూడా చెల్లాచెదురైపోయింది. ఇప్పటికే కొంత కేడర్ వైసీపీ వైపుకు వెళ్లిపోయింది.
మేకా ప్రతాప్ స్ట్రాంగ్‌గా ఉండటంతో, టీడీపీ బలం పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. అలాగే నూజివీడు మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరింది. నూజివీడులో మొత్తం 23 వార్డులో ఉంటే వైసీపీ 21 గెలుచుకోగా, టీడీపీ ఒకటి, బీజేపీ ఒకటి గెలుచుకుంది. మొత్తానికైతే నూజివీడులో మేకా ప్రతాప్ దెబ్బకు టీడీపీ అడ్రెస్ గల్లంతయ్యేలా ఉంది.