హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?


అన్నా రాంబాబు...2019 ఎన్నికల్లో జగన్ తర్వాత భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే. జగన్ దాదాపు 90 వేల పైనే మెజారిటీతో గెలిచారు. అయితే జగన్ తర్వాత ఊహించని విధంగా భారీ మెజారిటీ తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచిన ఎమ్మెల్యే...అన్నా వెంకట రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి రాంబాబు, టీడీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డిపై దాదాపు 81 వేల పైనే మెజారిటీతో గెలిచారు.


అయితే అసలు రాంబాబు 2009లో ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత పిఆర్‌పి, కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, ఆయన 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగి, నెక్స్ట్ టీడీపీలోకి వెళ్లారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గిద్దలూరు నుంచి పోటీ చేసి, అప్పటి వైసీపీ అభ్యర్ధి అశోక్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక, అశోక్ రెడ్డి పసుపు కండువా కప్పుకుంటే, రాంబాబు వైసీపీ కండువా కప్పుకున్నారు.


ఇక ఈ ఇద్దరే మళ్ళీ రివర్స్ లో 2019 ఎన్నికల్లో తలపడ్డారు. రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచేశారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడంతో గిద్దలూరు ప్రజలు ఆయనపై అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఆశలకు తగ్గట్టుగానే రాంబాబు కూడా పని చేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం చేస్తూనే, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలులో కూడా ముందున్నారు.


అయితే ఈయన ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వచ్చేది నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికే అని మాట్లాడి వివాదం సృష్టించారు. పైగా నియోజకవర్గంలో కూడా ఈయన వన్‌సైడ్‌గా వెళుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ అయిన ఆయన అనుచరులకే దక్కేలా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మొన్న ఆ మధ్య రాంబాబుని ఓ జనసేన కార్యకర్త స్థానిక సమస్యలపై రోడ్డు మీదే ప్రశ్నించారు.


ఇలా ప్రశ్నించిన వారం రోజుల్లోనే జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇక ఎమ్మెల్యే బెదిరించడం వల్లే తమ కార్యకర్త చనిపోయారని పవన్, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే ఇక్కడ నుంచి రాంబాబు పతనం మొదలైందని పవన్ ఫైర్ అయ్యారు.  అయితే నియోజకవర్గంలో రాంబాబుకు తిరుగులేదని ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలు వైసీపీ గెలుచుకుంది. అలాగే గిద్దలూరు నగర పంచాయితీ వైసీపీ ఖాతాలోనే పడింది. 20 వార్డులకు గాను వైసీపీ 16, టీడీపీ 3, ఇండిపెండెంట్ ఒకటి గెలుపొందారు. ఇక్కడ జనసేనకు పెద్ద సీన్ లేదని తెలుస్తోంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లోనైనా పవన్, రాంబాబుకు ఎలా చెక్ పెడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: