హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టెక్కలిలో సీన్ మారిందా? అచ్చెన్నతో ఇబ్బందేనా?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం...ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పట్టున్న స్థానం. దశాబ్దాల కాలం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోపేతం చేస్తున్న అచ్చెన్న...తొలిసారిగా 1996 ఉపఎన్నికలో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత అదే స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నియోజకవర్గానికి మారి, 2009 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయినా వెనక్కి తగ్గకుండా కష్టపడి అక్కడే పనిచేస్తూ, ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించడమే కాకుండా, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు.

ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి...రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే అచ్చెన్న విజయానికి బ్రేక్ పడలేదు. మళ్ళీ టెక్కలిలో టీడీపీ జెండాని ఎగరవేశారు. అయితే పార్టీ ఘోరంగా ఓడి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన,అచ్చెన్న మాత్రం నియోజకవర్గంలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ, అటు అసెంబ్లీలో గానీ, ఇటు బయటగానీ అధికార వైసీపీకి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్న ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తున్నారో చూస్తూనే ఉన్నాం.

అయితే ఏపీ అధ్యక్షుడు అయ్యాక, అచ్చెన్న టెక్కలి ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. దీంతో టెక్కలిలో వైసీపీ నేత పేరాడ తిలక్ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజలకు అండగా ఉంటున్నారు. ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో ముందుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా అచ్చెన్నకు చెక్ పెట్టి వైసీపీ జెండా ఎగరవేయాలనే కసితో పనిచేస్తున్నారు. కానీ పరిస్తితి అలా కనిపించడం లేదు. టెక్కలిలో ఇంకా సీన్ మారినట్లు లేదు. ఇక్కడ వైసీపీకి అచ్చెన్నతో ఇబ్బందిలాగానే ఉంది. స్థానిక ఎన్నికల్లో అచ్చెన్న సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, వైసీపీ టెక్కలిలో ఏ మేర సత్తా చాటుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: