హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చెవిరెడ్డి అడ్డాగా మారిన చంద్రబాబు సొంతగడ్డ...
చంద్రబాబు కుప్పం వెళ్లిపోయాక చంద్రగిరిలో టీడీపీ పరిస్థితి దారుణమైపోయింది. 1983, 1983, 1994 ఎన్నికల్లో తప్పా ఇక్కడ టీడీపీ మళ్ళీ గెలవలేదు. చంద్రగిరిలో మెజారిటీ సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. 2014, 2019 ఎన్నికలోచ్చేసరికి వరుసగా వైఎస్సార్‌సీపీ తరుపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఈయన హవా ముందు చంద్రగిరిలో టీడీపీ అడ్రెస్ లేకుండా పోతుంది. పైగా ఇప్పుడు చెవిరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి దాదాపు 228 కోట్ల నిధులు మజూరు చేయించుకుని, నియోజకవర్గంలో పనులు చేయిస్తున్నారు. అటు నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాగో ప్రజలకు అందుతూనే ఉన్నాయి. పార్టీల పరంగా చూసుకుంటే ఇక్కడ వైఎస్సార్‌సీపీ బాగా బలంగా ఉందని చెప్పడం కంటే చెవిరెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి తన పనితీరుతో జనాలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో టీడీపీలో ఉన్న బలమైన నేతలనీ తనవైపుకు తిప్పేసుకున్నారు.
అయితే ఇక్కడ టీడీపీ నాయకుడు పులివర్తి నాని సైతం దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కానీ ఎంత పోరాటం చేసినా ఇక్కడ చెవిరెడ్డి హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున చెవిరెడ్డి వైపే ఉన్నారని అర్ధమవుతుంది. మొత్తానికైతే చంద్రబాబు సొంతగడ్డ చెవిరెడ్డి అడ్డాగా మారిపోయిందనే చెప్పొచ్చు.