హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కాటసానికి బీసీతో ఇబ్బందేనా?
కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల సమయంలోనే కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉంటే వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు వచ్చాయి. ఇక టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికలోచ్చేసరికి మొత్తం సీట్లు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడ్డాయి. దీంతో కర్నూలు జిల్లాలో టీడీపీ పూర్తిగా వీక్ అయిపోయింది.
ఎన్నికలు ముగిసి ఏడాది దాటిన కూడా టీడీపీ పుంజుకోలేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి దారుణంగానే ఉంది. అయితే ఓ నియోజకవర్గంలో మాత్రం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు టీడీపీ నేత ధీటుగా పనిచేస్తున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి గట్టి పోటీనే ఇస్తున్నారు. అయితే కాటసాని రామిరెడ్డి 2009లో ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైఎస్సార్‌సీపీలోకి వచ్చేసి 2014 ఎన్నికల్లో టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక 2019 ఎన్నికల్లో బీసీని రామిరెడ్డి ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో కాటసాని బాగానే పనిచేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలని ప్రచారం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగే నియోజకవర్గంలో ప్రజల సమస్యలని పరిష్కరించడంలో ముందే ఉన్నారు. అదేవిధంగా టీడీపీతో సహ ఇతర పార్టీ కార్యకర్తలని తమ పార్టీలో చేర్చుకుంటూ ముందుకెళుతున్నారు.
అయితే బనగానపల్లెలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలైతే జరగడం లేదు. గతంలో బీసీ జనార్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో కొత్త కార్యక్రమాలు ఏమి జరగ లేదు. ఇక్కడ బీసీ జనార్ధన్‌కు వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే కర్నూలు జిల్లాలో మిగతా టీడీపీ నేతలంతా భారీ మెజారిటీలతో ఓడిపోయిన కూడా బీసీ 13 వేల మెజారిటీతోనే ఓడిపోయారు. అలాగే ఓడిపోయాక కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తున్నారు.
అలాగే కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. అయితే ఈ నాలుగేళ్లలో కాటసాని స్ట్రాంగ్ అవ్వకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ బనగానపల్లె బీసీ వైపే ఉంటుంది.