హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి డిపాజిట్ దక్కని చోట ఆ ఎమ్మెల్యే దూసుకెళుతున్నారా?
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక 175 సీట్లకు గాను టీడీపీ 23 సీట్లు తెచ్చుకుంది. అయితే టీడీపీ ఓడిన అన్ని స్థానాల్లో రెండు స్థానంలో నిలిచింది. కానీ ఒకే ఒక స్థానంలో మాత్రం డిపాజిట్ కోల్పోయి దారుణ పరాజయం మూటగట్టుకుంది. అలా టీడీపీకి డిపాజిట్ దక్కని స్థానం అరకు. విశాఖపట్నం ఏజెన్సీ పరిధిలో ఉన్న ఈ స్థానం నుంచి టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ దారుణంగా ఓడిపోయారు.
ఇక్కడ నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన చెట్టి పాల్గుణ, స్వతంత్ర అభ్యర్థి సియ్యారిపై 26 వేలపైనే మెజారిటీతో గెలిచారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రవణ్ 20 వేల ఓట్లతో డిపాజిట్ కోల్పోయి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన పాల్గుణ తనకు సాధ్యమైన మేర పని చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని తీర్చేందుకు పాల్గుణ బాగానే కష్టపడుతున్నారు.
కాకపోతే ఇక్కడ టీడీపీ వీక్ గా ఉండటంతో పాల్గుణకు తిరుగులేకుండా ఉంది. ఎలాగో అరకు ప్రాంతంలో వైఎస్ అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి, పాల్గుణకు కలిసొస్తుంది. అటు టీడీపీ నేత శ్రవణ్ కూడా బాగానే కష్టపడుతున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ...ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే శ్రవణ్ ఇంకా పుంజుకున్నట్లు కనిపించడం లేదు.
అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే....వైసీపీ బలంగా ఉండటం వల్ల, నియోజకవర్గంలో దాదాపు 70 శాతం పైగా స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో వైసీపీకి టీడీపీ పోటీ ఇచ్చే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. మొత్తానికి చూసుకున్నట్లైతే టీడీపీ వీక్ గా ఉండటం వల్ల పాల్గుణ దూసుకెళుతున్నారు.