హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కారు ఎమ్మెల్యే చుట్టూ వివాదాలే.!

ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట..ఆ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం టీడీపీకి అడ్డాలుగా ఉండేవి. అయితే టీడీపీ కనుమరుగయ్యాక జిల్లాలో టీఆర్ఎస్ హవా మొదలైంది. జిల్లా మొత్తం టీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. అక్కడ వరుసపెట్టి సత్తా చాటుతూ వస్తుంది. ఈ క్రమంలోనే భోదన్ నియోజకవర్గం కూడా టీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడ గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ల హవా నడిచింది.
1983, 1985, 1989, 1994 వరకు టీడీపీ గెలవగా, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ తరుపున సుదర్శన్ రెడ్డి గెలుస్తూ వచ్చారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ తరుపున షకీల్ అమీర్ సత్తా చాటుతూ వస్తున్నారు. ఇలా రెండు పర్యాయాలు వరుసగా గెలుస్తూ వచ్చిన ప్రజల మధ్యలో ఉండటం కంటే ఎక్కువ వివాదాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా బాగానే పనులు చేస్తున్నా సరే, అప్పుడప్పుడు వివాదాల్లో ఉంటూ హైలైట్ అవుతున్నారు.
ఆ మధ్య అసలు టీఆర్ఎస్ నుంచే బయటకొచ్చేస్తానని హడావిడి చేశారు. అలాగే బీజేపీ ఎంపీ అరవింద్‌ని కలిసి నిజామాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. మంత్రి పదవి దక్కలేదని చెప్పి, టీఆర్ఎస్‌లో సరైన న్యాయం జరగడం లేదని, అలాగే టీఆర్ఎస్‌లో ఉండలేకపోతున్నానని, పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అని కొన్ని రోజులు హల్చల్ చేశారు. కానీ మళ్ళీ టీఆర్ఎస్‌లో దూకుడు పనిచేస్తున్నారు. ఆ మధ్య తీన్మార్ మల్లన్నని నరికేస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.
అలాగే ఒక కిరాణా షాపు యజమానిని తిడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అటు నియోజకవర్గంలో పనులు చేయడం లేదని ప్రజలు ఎక్కడకక్కడే నిలదీస్తున్నారు. ఇలా షకీల్ చుట్టూ అన్నీ వివాదాలే ఉన్నాయి. ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పుంజుకుంటున్నారు. వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఆయనపై ఉంది...మరి ఈ సారి షకీల్‌కు చెక్ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: