మన యువతకి ఏమైంది? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?

frame మన యువతకి ఏమైంది? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల వార్షిక పెరుగుదల రేటు దేశంలోని జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. నేణనల్ క్రైం రికార్డ్ బ్యూరో సమాచారం ఆధారంగా.. ఐసీ 3 స్వచ్ఛంద సంస్థ ఈ నివేదికను రూపొందించింది.


పోలీసులు రికార్డులకు ఎక్కని ఆత్మహత్యలు కలిపితే ఈ రేటు మరింత ఆందోళనకరస్థాయిలో ఉంటుందని నివేదిక పేర్కొంది. స్టూడెంట్ సూసైడ్స్ యాన్ ఎపిడెమిక్ స్విపింగ్ ఇండియా పేరిట రూపొందించిన నివేదికను తాజాగా యాన్యువల్ ఐసీ3 కాన్ఫరెన్స్ అండ్ఎక్స్ పో -2024 లో విడుదల చేశారు. దేశంలో ఆత్మ హత్యలు సంఖ్య ఏటా రెండు శాతం పెరుగుతుండగా.. విద్యార్థుల ఆత్మహత్యల రేటు నాలుగు శాతానికి పెరిగిందని వెల్లడించింది.


గత దశాబ్ద కాలంలో 0 నుంచి 24 ఏళ్లలోపు జనాభా 58.2 కోట్ల నుంచి 58.1 కోట్లకు తగ్గిపోయింది. అదే సమయంలో విద్యార్థుల ఆత్మహత్యలు సంఖ్య 6654 నుంచి 13044 కి పెరిగిపోయింది అని తెలిపింది. గత దశాబ్ద కాలంలో పురుష విద్యార్థుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 61 శాతం పెరిగిపోయాయని పేర్కొంది.


2022లో జరిగిన ఆత్మహత్యల్లో 53 శాతం పురుష విద్యార్థులు ఉన్నారని వివరించింది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపింది. కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటా ప్రాంతం ఉన్న రాజస్థాన్ లో విద్యార్థులు ఆత్మహత్యల్లో ఆ రాష్ట్రం పదో స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. మానసిక ఒత్తిళ్లు, తదితర కారణాలతోనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మన విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్య సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోందని నివేదిక పేర్కొంది.


మొత్తం ఆత్మహత్యల్లో 29 శాతం దక్షిణాది రాష్ష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి.  విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ సదుపాయాలను పెంచాల్సిన ఆవశ్యకతను ఇది తెలియపరుస్తోందని ఐసీ3 వ్యవస్థాపకుడు గణేశ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: