శుభవార్త : అంగారకుడిపై నీళ్లు! వెళ్లొద్దాం రండి ...
అనగా ఇప్పుడే కాదు కొద్ది రోజులు ఆగాక
కావాలంటే చెప్పండి..ఇక్కడ ఉండి కొట్టుకునే కన్నా
విశ్వంలో ఏదో ఒక చోటు వెతికి అక్కడి నుంచి
ప్రపంచాన్ని వీక్షించాలన్న కోరికనూ, అంతరీక్ష నేలలకు ఉన్న స్వభావాన్ని తెలుసుకుని తీరాలనుకునేవారికిది శుభవార్త..ఏంటంటే నాసా పరిశోధన అనుసారం లేదా ప్రకారం అంగారకుడిపై నీళ్లున్నాయని! అనండి మ..మ..మాస్..మ..మ..మార్స్ అని!
నీటిపై రాతలు ఎలా ఉన్నాయో తెలియవు కానీ నీటి ఆనవాలు కనుగోవాలన్న రాత మాత్రం తప్పక అమలు అయ్యేలానే ఉంది. ఆ కల రాతను నాసా రుజువు చేయనుంది.అంగారక గ్రహంపై నీటి ఆనవాలు గుర్తించి శుభవార్తను ఈ వారాంతం అందించింది. ఇంకొంచెం పరిశోధన సాగిస్తే మరిన్ని వాస్తవాలు వెల్లడిలోకి తెచ్చేందుకు ఆస్కారం ఉంది.ఇంకేం ఛలో మార్క్ .. జై కొట్టు అంగారకుడికి!
నీరుంది ఓ చోట నిప్పు ఉంది మరోచోట.. నీరున్న చోట నాగరికం..నిప్పున్న చోట ఉద్యమం ఈ రెండూ కలిస్తే మానవ సమూహ నిర్మాణానికి,మనుగడకూ ఓ ఆధారం. అవును! భూమ్మీద కాదు మనం మరో ఆవాస యోగ్యమైన గ్రహం వెతుక్కోవాలి..అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ లు గట్రా చేయాలి.గ్రహాలు అనుకూలిస్తే నీటి జాడలు దొరకడం ఏమంత కష్టం కాదు.అందుకు మాస్ ఆర్బిటార్ మిషన్లు ఉన్నాయి. మార్స్ రికనసెన్స్ ఆర్బిటార్ కారణంగానే అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. దీని ఫలితంగా మరో పదేళ్లు ఆగితే అక్కడ కూడా మనం ఉండొచ్చు..ప్రస్తుతానికి ఆనీరు అంతా ఆవిరై ఉప్పు పెళ్లలు కనిపిస్తున్నాయి. ఉప్పు నిల్వలున్న చోటే నీరు ఉండి ఉంటుందని వాళ్ల అంచనా! వాళ్లు అనగా నాసా అని అర్థం!
భూమ్మీద బతికి బతికి ఇక చాలు వేరే గ్రహం ఏదయినా వెతుక్కోవాలి అనుకునే వారికి, ఆ విధంగా ప్రయత్నాలు షురూ చేసిన వారికీ ఓ శుభవార్త.మన దగ్గర నీళ్లు లేక, నీటి యుద్ధాలు చేయలేక, ప్రాజెక్టుల్లో నీటి వాటాల లెక్క తేలక నానా అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి. వాటిని దాటుకుని ఒక్కసారి విశ్వ దర్శనం చేసుకుంటే అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నాయి నాసా వర్గాలు.అంటే ఇక్కడ ఉన్న కష్టాలు అక్కడ ఉండవు అని తేల్చేశారు నాసా శాస్త్రవేత్తల సమూహం. 2030 నాటికి అక్కడికి చేరుకుని మానవ ఆవాస గ్రహంగా అంగారక గ్రహం అవుతుందో లేదో తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న కొత్త ప్రపంచపు ఔత్సాహికులకు నిజంగానే ఇది ఓ శుభవార్త.