హ్యాపీ క్రిస్మస్ : కరుణామయుని జగతిలో ఇన్ని అపార్థాలా ఎందుకు?

RATNA KISHORE
ఇంకో జ‌న్మ‌ను ఇవ్వ‌మ‌ని అడ‌గ‌డంలో అర్థం లేదు. ఇప్ప‌టి అపార్థం తొల‌గించ‌మ‌ని వేడుకోవ‌డంలోనే సిస‌లు బాధ్య‌త దాగి ఉంది. ప్ర‌భువు  అపార్థాల‌ను తొల‌గించి కొత్త వ‌రాలు ఇస్తాడ‌ని భావించాలి. ప్ర‌పంచంలో ఉన్న ద్వేషం తొల‌గితే కొన్ని అర్థవంత‌మ‌యిన ప్రేమ‌లు నిల‌దొక్కుకుంటాయి. ప్రేమ అర్థ‌వంతం అయితే జీవిత సారం ప్ర‌భు నిర్దేశం అయి ఉంటుంది. ఇత‌రుల‌ను ప్రేమిచండంలో అర్థం క‌న్నా అనుభ‌వం క‌న్నా ఒకింత స్వార్థ‌మే మ‌న‌కు లోప‌ల ఉంటుంది. లోప‌ల ఉన్న‌వి వెలుగులోకి రావ‌డం ఆల‌స్యం అయితే జీవితం ఇంకాస్త చీక‌టి మ‌యం అయిపోతుంది...
విలువ‌యిన త్యాగం మాత్రం ఏస‌య్య మ‌నంద‌రి కోసం చేశాడు. అలా చేయ‌డంలోనే అత‌ని జీవితం ఆద‌ర్శ‌నీయం అయింది అని ఓ ఫాద‌ర్ చెబుతున్నారు. త్యాగం విలువ మ‌నిషి గుర్తించ‌డంలో కాదు ఇత‌రుల జీవితాల‌ను ప్ర‌భావితం చేసేలా ఆచ‌ర‌ణ‌కు సిద్ధం కావ‌డ‌మే బాగుంటుంది. క‌నుక త్యాగం దేశాన్ని ర‌క్షించిన చోటు ఉంటుంద‌ని చ‌దివేను..అపార్థాలు కొట్టుకుపోతే త్యాగం విలువ ఇంకా బాగా తెలిసివ‌స్తుంద‌ని కూడా చ‌దివేను.. ఇంటి మీద న‌క్ష‌త్రం దివ్యం అయిన త్యాగం అని ఫాద‌ర్ అంటున్నారు. త్యాగం ఇక్క‌డ దివ్య‌త్వానికి సంకేతం..దీన‌త్వాన్ని తొల‌గించి దివ్య‌త్వం ఇవ్వ‌డ‌మే ప్ర‌భుతత్వం.
ఇవాళ క్రిస్మ‌స్..ఇంకా చెప్పాలంటే ప్ర‌పంచానికే ఓ వెలుగుల పండుగ..ఆకాశ వీధి నుంచి తార‌ల స‌మూహం న‌వ్వుతూ లోకాన్ని దీవించే పండుగ. తార‌లన్నీ కొన్ని మాట‌ల‌ను కొన్ని విలువ‌యిన ఆజ్ఞల‌ను అందించే పండుగ.. ఇంటి మీద తార కొత్త వెలుగు.. కొత్త అనుభవం కూడా అంటున్నారొక ఫాద‌ర్. అవును! వెలుగు ఎప్పుడూ కొత్త అనుభవ‌మే! స్వీయ కాంతి విస్తారం అన్న‌ది ఒక కొత్త మార్పునకు ఆరంభం. ప్రేమ నిండిన మ‌నుషులను మ‌నం చూడ‌డం వెత‌క‌డం అత్యాశ క‌దూ! క‌నుక సముద్రంలో మొండి ప‌ట్టుద‌ల‌తో అడుగులు వేయ‌డం కూడా మ‌న‌కు చేత‌గాదు. అవును ప్ర‌భువు న‌డిచినంత సులువుగా మ‌నం స‌ముద్ర అల‌ల‌పై అడుగులు వేయ‌లేం. ప్ర‌కృతికి దాసోహం అయి ఉండ‌లేం. మ‌న‌కు ఏవీ చేత‌గావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: