మార్నింగ్ రాగా : తుఫాను చిత్తం ప్రాసంగికం

RATNA KISHORE
కోరి వ‌చ్చిన వాన కాదిది..మ‌రి! గోరువెచ్చ‌న ఎలా అవుతుంది..
ఓ చోట వేటూరి అంటారు ఆ విధంగా ఓ య‌వ్వ‌న ప్రాయాన్ని స్మ‌రిస్తూ..
కోరి వ‌చ్చిన ఈ వాన గోరు వెచ్చ‌నై నాలోన అని.. !
పరువ‌మో ప్రాయ‌మో  మోహ‌మో నిర్మోహమో ఏదో ఒక‌టి వాన చెంత
చేసే ప్ర‌తిపాద‌నే క‌విత్వానికో వ‌స్తువు కావాలి..
కానీ ఈ వానది ఆ కోవ కాదు ఆ తోవ కాదు..కాలేదు..
మ‌రి! వేళ కాని వేళ వ‌చ్చిన వాన‌ల‌కు ఊరి చివ‌ర ఇల్లు తోడయిందా?
లేదా వాంఛాతీతం కానివ్వ‌ని వాన ఒక‌టి ప్ర‌ళ‌య కాల సంవ‌ర్త‌న‌ల‌కు తోడ‌యిందా?

 


బాధ‌లు తీర్చే వాన‌ల కోసం ఓ క‌వి ప్రార్థించాడు. గాలీ వానా లాలి పాడిన సంద‌ర్భాల‌లో వ‌చ్చిన ప్రార్థ‌న అది..అంత‌టి విజ్ఞ‌త వాన‌కు ఇప్ప‌టి వాన‌కు లేదు. వాన ప్రాసంగికమే కానీ ప్ర‌యోజ‌న‌వాది కాదు. నిష్ఫ‌ల దాయ‌కం.. నిస్పృహ కార‌కం.. అయినంత వ‌ర‌కూ వాన‌కు సంద‌ర్భ శుద్ధి లేనంత వ‌ర‌కూ ప్ర‌పంచం నుంచి మాయ‌మ‌యిన ఆనందాల‌ను వెన‌క్కు తెప్పించ‌డం సాధ్యం కాని ప‌ని.



సంతృప్త‌త అన్న‌ది వాన‌కు లేన‌ప్పుడు విల‌యాలు వెక్కిరించి వెళ్తాయి. సంతృప్త‌త అన్న‌ది జీవితాన లేనంత వ‌ర‌కూ విక‌లం అయిన వాన‌లే జీవితానికో శాపం అయి వేధిస్తాయి. వాన ఒక వేధింపు కానంత వ‌ర‌కూ మ‌న‌కు రుతు వ‌ర్ణ‌న సాధ్యం.. మేఘ సందేశం సాధ్యం.. కావ్య వ‌ర్ణ‌న సాధ్యం.. మేఘాలాప‌నలో విన్న రాగాల కూర్పు కూడా సాధ్యం.. అకాల వాన‌ల‌కు ఇన్నింటిని అనువ‌ర్తింప‌జేయ‌డంలో ఔన్న‌త్యం లేదు.. ఔన్న‌త్యం కాదు అర్థం చెడిన వాన‌కు అర్థం ఎలా చెప్ప‌గ‌ల‌ను. క‌నుక ఇవ‌న్నీ దేహాల‌కు గాయాలు.. లోకానికి  అనుచితం అనిపించే ప‌నులు.. అసంద‌ర్భ విలాపాన్ని మోసుకువ‌చ్చిన వాన వికృత కార‌కం.


 
తీరం దాటాక సంజ్ఞ‌లన్నీ వినాల‌ని ఉంది. తుఫాను తీరం అన్న‌ది కొన్ని విల‌యాల‌కు అనువర్తనం అయి ఉంటుంది. లేదా కొన్ని ప్ర‌శాంత‌త‌ల‌కు కొన‌సాగింపుగా కూడా ఉండి ఉంటుంది. తీరం దాటాక ప్ర‌శాంత‌త క‌నుక అందాక భ‌రించాల్సిన వికృతం ఒక‌టి స‌మాజంలో ఉంది. స‌మూహంలో ఉంది. వాన ప‌రివ‌ర్త‌న కార‌కం కాన‌ప్పుడు ప్ర‌భుత్వాల‌కు అదొక ప‌రిహార గుణ‌కం. అదొక ప్ర‌క‌ట‌న గుణ‌కం.. వాన ప్ర‌తిపాదిత ఆనందాల‌కు ప్ర‌తినిధి కాలేన‌ప్పుడు మ‌న జీవితాల్లో మోయాల్సిన దుఃఖం పంచాల్సిన దుఃఖం ఇంకొంత ఈ వాన‌తోనే పెరిగి ఉంటుంది. దుఃఖాల‌ను పంచుకోవాలిప్పుడు. అప్పుడు మాత్రం గుండె భారం త‌గ్గి తీరుతుంది.


మ‌నిషి, దేవుడు అనే ఈ రెండు విభిన్న ధ్రువాల చెంత విస్తృతం కానీయ‌ని వాన‌లు ఉంటే మేలు. లేదా వానొచ్చి కొన్ని మ‌ర‌ణా ల‌ను హేతువుకు తూగేలా చేస్తే ఇంకా మేలు. మ‌ర‌ణ కాల వాంఛితాల‌ను ప్ర‌సాదించిన వాన‌లు శివ‌త‌త్వాన్ని వినిపిస్తాయా.. ల‌యం శివం.. భ‌వం శివం.. భ‌వ‌మో భ‌య‌మో ఈ రెండూ విరుద్ధాలు కొన్నింట‌! విరుద్ధం శివం వెర‌సి వాన ఓ శివం..అహం కూడా! క‌నుక అహంభావి అయిన వాన త‌న త‌ల పొగ‌రు చూపించిన ప్ర‌తిసారీ మ‌నిషి త‌ల దించి చేసే ప్రార్థ‌న బాగుంటుంది. ఫ‌లితం ఇస్తుందో లేదో చెప్ప‌లేను.. వాన వైదికం కావొచ్చు.. వాన విప్ల‌వ గుణ‌కం కావొచ్చు. వాన అనేక ల‌వ‌ణాల స‌మూదాయం.. కొన్నింట ధాతువు ఉనికికి కార‌ణం.. కొన్నింట మృత్యు విలాపాల‌కు అదొక నిషిద్ధం అయితే మేలు. క‌నుక నిషిద్ధ వాన ఇవాళ వ‌చ్చి జ‌వాద్ అనే తుఫాను పేరు త‌గిలించుకుని పోయింది.

 
నిషిద్ధ వాన మొన్న‌టి వేళ వ‌చ్చి గులాబ్ అనే తుఫాను పేరుతో ప‌ల‌క‌రించి పోయింది. పేరు ప‌ల‌క‌రింత కాదు క‌ల‌వ‌రింత.. వాన క‌ల‌హ కార‌కం క‌నుక వియోగం అన్న‌ది ఆకాశం విధించిన శాస‌నం కావొచ్చు.. అలిఖిత శాస‌నం క‌నుక ప‌రిణామ గ‌తుల‌ను ప్రాప్తం అనుకోవ‌డంలో మ‌న‌కు మిన‌హాయింపులేవీ లేవు.. ఇక వాన అలిఖిత శాసనం. ప్రాసంగిక కార‌కం. తుఫాను  వ‌చ్చిన ప్ర‌తిసారి వినిపించే హెచ్చ‌రిక దేవుడి ఆజ్ఞ అని కొంద‌రు భావిస్తారు. మ‌నిషి ప్ర‌మేయం లేకుండా జ‌రిగిన వాన‌లు కావివి కనుక ఆ త‌ర‌హా ఆపాద‌న త‌ప్పు! విన‌మ్ర కాలాలేవీ మ‌నుషుల్లో లేన‌ప్పుడు వాన విల‌య‌కార‌కం అయి ఉంటుంది. ఆ సంద‌ర్భాన వికృతాన్ని ప్రేమించే శ‌క్తి కూడా మ‌నిషికి ఆదేశాన్ని ఇస్తుంది. వాన దైవాజ్ఞ కాదు .. మ‌నిషి పాపానికి మ‌నిషి ఇంగితం లేకుండా చేస్తున్న త‌ప్పుల‌కు ప్ర‌తీక.. సంకేతిక.. ధాతువుల‌ను క‌లిపే వాన‌లు లేవు.. వ‌నాల‌ను అర్చించి అర్థం చెప్పిన వాన‌లు లేవు.. రుతు వ‌ర్ణ‌న‌ల‌కు తుల‌తూగే వాన‌లు అస్స‌లు లేవు. వాన అంటే ఛీత్కారం.. వాన అంటే ఓ అస‌హ్యం.. భ‌యం అదుపు త‌ప్పిన భ‌యం.. తెల్లారి క‌ల క‌రిగి క‌న్నీరయింది.. రాత్రి క‌ల తెల్లారి వేధించాక వాన అయింది. వాన ఇప్ప‌టి నుంచి ఎప్ప‌టిదాకా?



చెడు చేయ‌ద‌గినివి..చెడును సంస్క‌రించ‌ద‌గినివి..కొన్నే ఉంటాయి. కొన్ని మాత్రమే ఆ న‌డ‌వ‌డిని పొంది ఉంటాయి. వాన చెడును మాత్ర‌మే కాదు చెడ్డ దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వాన మా ఊళ్లో  మా ఇంట్లో నట్ట‌డివిలో.. నేల దిగువ పొర‌ల్లో.. ఇంకిన బిందువుల్లో వివిధ రూపాల్లో .. నేల త‌ల్లి బిడ్డ‌ల‌కు పుత్ర శోకం ఇచ్చిన వాన. నింగి నుంచి నేల‌కు దూకాక ఒళ్లు మ‌రిచిన వాన..ఇంగితం లేని వాన మ‌న‌లోన! వాన‌లన్నీ మంచికి ప్ర‌తిరూపాలు కావు.. మ‌నుషులంతా మ‌ట్టిలో క‌రిగాక కూడా వాన ఉంటుంది.. అది మాత్రం చివ‌రి లేఖ ఒక‌టి నింగి నుంచి మోసుకువ‌చ్చి మ‌ర‌ణ వాంగ్మ‌య లేఖ ఒక‌టి త‌నంత‌ట వినిపిస్తుంది. ఇక్క‌డ వాన లేఖాక్ష‌రి.. కొన్ని చోట్ల వాన పంచాక్ష‌రి. కొన్ని చోట్ల వాన దీర్ఘాక్ష‌రి. దీర్ఘ కాలాన వానలు  పంట‌ల‌ను ముంచాయి.. దీర్ఘ‌కాలాన వాన‌లు దేహాల‌కు ఎడ‌తెగ‌ని గాయాలు మోయ‌మ‌ని చెప్పి వెళ్లాయి. తుఫాను అనే ప‌దం వింటే రెండు తీరాలు వ‌ణుకుతాయి.. ఆరంభ తీరం అంతిమ తీరం.. ఎక్క‌డో పుట్టిన తుఫాను విల‌య వాంఛ మా ఊరి దాకా మీ ఇంటి దాకా వ‌చ్చే ఉంటుంది! క‌నుక ప్ర‌ళయాజ్ఞ వాన. ప్ర‌తికారేచ్ఛ అయిన వాన‌కు ఇక వీడ్కోలు.


మేలి ముత్యాల వాన మంచి ముత్యాల వాన జీవితాన అని ఎవ్వ‌రు అనుకున్నా ఆనంద‌మే. మృత్యు ఘోష‌ల వాన.. వివ‌ర్ణ  వ‌ల‌యాల వాన విస్తృతాన అని ఎవ్వ‌రు అన‌కున్నా మంచిదే. మంచి అనే సందిగ్ధ‌త ఒక‌టి లోప‌ల దాగి పోయింది. వాన సందేహాల‌కు ప‌రిష్కారం కాదు. నివృత్తి మార్గం కూడా కాదు. దిశ లేని వాన‌ల‌కు ఇవేవీ తెలియ‌దు. దు కాదు వు. తెలియ‌వు. కాలం ఇచ్చిన  కొన్ని సందిగ్ధ‌త‌ల‌ను మ‌నిషి త‌న జీవితాన మోస్తాడు. మ‌నిషి మిగిల్చిన కొన్ని ఆన‌వాళ్ల‌ను నేల మోస్తుంది. లేదా కొద్దిమంది మాత్రమే మోసి త‌రువాత ఆ భారం విదిలించుకుంటారు. నెత్తిన పెట్టుకుని పూజించిన వాన‌లేవీ ఇప్పుడు లేవు. ఉన్న‌వన్నీ క‌ల్లోలితాలు క‌ల‌హాంత‌కాలు కూడా! విర‌హాంత‌కం అవునో కాదో! భ‌వాంతకం పురాంత‌కం స్మ‌రాంతకం..ఇలాంటి అంత‌కాల చిత్తాలు శివ త‌త్వంలో ఉంటాయి.. కాలాంత‌క ధోర‌ణి శివ‌త‌త్వం మాత్రమే నేర్పిపోతుంది. ఇవ‌న్నీ కాలాంత‌కాలు.. ఇవ‌న్నీ చిత్తం నుంచి చిత్తం వ‌ర‌కూ పొందిన విస్తృతాలు.

 


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: