మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి
మానవజాతి ప్రగతికి సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తుంది. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు , కట్టు, బొట్టు, ఆహార వ్యవహారాలతో కూడిన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న భారతీయ సంస్కృతి, మహోన్నతమైనది. దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా భారతదేశం ఉంది. నేడు ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్బంగా అందరికీ శుభాకాంక్షలు. ఏదైనా ఒక సమాజంలోని ప్రజల జీవనశైలిని ఆ సమాజం యొక్క సంస్కృతిగా అభివర్ణించవచ్చు. సంస్కృతి పరంగా ఒకే విధమైన సజాతీయ లక్షణాలు గల భూప్రాంతాలన్నిటిని కలిపి ఒక సాంస్కృతిక మండలం అని వ్యవహరిస్తారు. అంటే ఒక సాంస్కృతిక మండలం, దాదాపుగా ఒక విలక్షణమైన సంస్కృతిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక మండలం అనేది సాంస్కృతిక మానవ శాస్త్రంలో ఒక భావన. ఏదైనా ఒక కాలక్రమంలో పర్యావరణం పరంగాను, సంస్కృతి పరంగాను ఏకరూపకత కలిగివున్న భౌగోళిక ప్రాంతాన్ని సాంస్కృతిక మండలం గా పేర్కొనవచ్చు.
భారతదేశం తన ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. ఆక్రమణదారులు, వలస వచ్చినవారి సంప్రదాయాలను కూడా తనలో ఇముడ్చుకుంది. తాజ్‌మహల్ వంటి కట్టడాలు, మరెన్నో సంస్కృతీ, సంప్రదాయాలు మొగలు పాలకుల నుండి వారసత్వంగా స్వీకరించింది. భారతీయ సమాజము భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో కూడిన బహుళ సమాజం. వివిధ మత కార్యక్రమాలు సంఘ దైనందిన జీవితంలో ఒక భాగం. అన్ని సామాజిక, ఆర్ధిక వర్గాలలోను విద్యను ఉన్నతంగా భావిస్తారు. సాంప్రదాయికమైన సమష్టి కుటుంబ వ్యవస్థలోని ఆర్ధిక అవరోధాల దృష్ట్యా చిరు కుటుంబాలు ఎక్కువైపోతున్నప్పటికీ, సాంప్రదాయిక కుటుంబ విలువలను పవిత్రంగా భావిస్తారు, గౌరవిస్తారు. ఇటువంటి సాంస్కృతిక విలువలు ఉండటం వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా భారత దేశం కీర్తించబడుతోంది.