కరోనా వేళ.. ఉపయోగపడుతున్న పల్లె బతుకు పాఠాలు?

కరోనా కారణంగా  బతుకు భయంగా మారింది. ప్రతి విషయానికి భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తమ పల్లె నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తమకు ధైర్యంగా బతకడం పల్లె ఎలా నేర్పిందో గుర్తు చేసుకుంటున్నారు. కరోనా వేళ.. పల్లె పదే పదే గుర్తొస్తోంది. పల్లెలు నేర్పిన జీవిత పాఠాలు గుర్తొస్తున్నాయి.. అవేంటో చూద్దాం..

పొలం గట్లపై నడిపించి..  
తడబడకుండా నిలదొక్కుకోవటం  నేర్పింది.

వాగు పక్కన నీటి  చెలిమలు తీయించి,
శోధించే తత్వం నేర్పింది.

సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,
అన్వేషణ నేర్పింది.

తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,
జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.

ఆవులతో,  గేదెలతో, కోళ్లతో స్నేహం చేయించి,
ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,  ప్రేమతత్వాన్ని నేర్పింది.

రాగడి  మట్టితో బండి గిర్రలు చేయించి,
మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి,
పనితనం నేర్పింది.

వేలాడే పిచుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య
కొంగ గూళ్ళు చూపించి.. బొమ్మరిల్లు కట్టించి,
చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.

బతుకమ్మ తంగేడు గునుగు పూల కోసం,
తెల్లవారుతూనే  పొలం బాట పట్టించి,
ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది.

పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే,
నల్లాలం  ఆకు పసరు పోయించి,
చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.

నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి,
జీవితమంటే బరువు బాధ్యత అని నేర్పింది.


ఇంటి ముంగిటకు  అతిథి దేవతలు
హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,
ఉన్న దాంట్లో కొంత  పంచుకునే గుణం నేర్పింది,

ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి,
ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.


ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి,
కాకి ఎంగిలి పేరుతొ దోస్తులతో పంచుకోవటం నేర్పింది.


ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ,
స్వయం సంపాదన ధోరణి నేర్పింది.


వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి,
వస్తు తయారీ మెళకువలు నేర్పింది.

అత్తా, మామా, అన్నా,  వదినా,  అమ్మమ్మా, నాయినమ్మా వరుసలతో,
ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.

ధైర్యంగా  బ్రతికే  పాఠాలను నేర్పిన
మా పల్లె రుణం ఎన్నటికీ తీరనిదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: