అక్కడ చేపలతో 90 రకాల వంటలను చేస్తారట..!
ఈ వంటకాల తయారీలో మహిళలకు శిక్షణనిస్తూ ఘు మఘుమలాడుతోంది ఖమ్మం జిల్లా పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధన కేంద్రం. పోషకాహార విలువలు కలిగిన చేపలు.. చికెన్, మటన్‌తో పోలిస్తే చౌకగానే లభిస్తాయి. చేపలతో చేసే విభిన్న వంటకాలకు ప్రస్తుతం మార్కెట్లో మం చి గిరాకీ ఉంది. ఈ క్రమంలోనే చేపల వంటకాల తో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్య పరి శోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో మహిళలకు శిక్షణనిస్తున్నారు.
చేపల ఉత్పత్తులతో వంటకాలు తయారుచేసి విక్రయిస్తే అదనపు ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు మూడు దఫాలుగా 180 మంది మహిళా మత్స్యకారులకు శిక్షణనిచ్చారు. ప్రస్తుతం పంజాబ్‌లోని లూథియానాకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఎస్సీ మహిళలకు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చేపల ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తున్నారు..భీమవరానికి చెందిన చేపల ఉత్పత్తుల తయారీ నిపుణురాలు పెన్మత్స భాగ్యలక్ష్మి పలు వంటలను పరిచయం చేస్తున్నారు. చేపల పులుసు, ఫ్రై, పచ్చడితోపాటు చేప కాజాలు, చేప చపాతీ, చేప ఫింగర్స్, చేప బజ్జీ, చేప పసంద్, చేప బిర్యానీ, ఫిల్లెట్స్, లాలీపాప్, సమోసాలు, రొయ్యల పొడి, రొయ్యల రోల్స్.. ఇలా కేవలం చేపలతో మాత్రమే కాదు.. చికెన్, మటన్ వంటి వాటితో కూడా రకరకాల వంటలను తయారు చేస్తూ లాభాలను పొందుతున్నారు.