పులస చేప విషయంలో మోసపోకండి.. ఇలా గుర్తుపట్టండి...

NAGARJUNA NAKKA
తింటే పులస చేపే తినాలి. వింటే దాని వైభోగమే వినాలి. ఏంటి పులస చేపకు అంత స్పెషల్‌ అంటారా? చాలా ఉందండి. ఏడాదిలో రెండు నెలలు మాత్రమే దొరికే ఈ చేపకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే దాని రుచికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఇంతకీ పులస చేపకి అంత టేస్ట్ రావడం వెనుక సీక్రెట్‌ ఏంటి.. ఆ చేపను ఎలా గుర్తుపట్టాలో ఓ సారి చూద్దాం..  


పులస పేరు చెబితే చాలు... నోరూరిపోతుంది. అలా నోట్లో వేసుకుంటే ఇలా కమ్మగా కరిగిపోతుంది. పులసలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. వర్షాకాలంలో.. అందునా ఆషాఢ, శ్రావణ మాసాల్లో గోదావరిలో దొరుకుతాయి. అందుకే వీటికింత డిమాండ్. పులస టేస్ట్‌కి ఎవరైనా దాసోహం అయిపోతారు. ఇక పొరుగు రాష్ట్రాలయితే ఆ రుచిని ఆస్వాదించేందుకు తహతహలాడతాయి.  ఎన్నిసార్లు తిన్నా... లొట్టలేయాల్సిందే..! గోదావరి వాసులు అసలే భోజనప్రియులు. అందుకే పులస చేప రాకకోసం ఏడాదిపొడవునా ఓపిగ్గా నిరీక్షిస్తూ ఉంటారు. సరిగ్గా వర్షాకాల మొచ్చిదంటే చాలు... అంతా గోదారి ఒడ్డునే కనిపిస్తారు. వేల రూపాయల ధర పలికే ఈ చేప కోసం తెగ ఆరాటపడతారు. 


ఉభయగోదావరి జిల్లాల్లో స్వచ్ఛమైన గోదావరి నీటిలో...దొరికే పులస చేపంటే అక్కడి ప్రజలకు ఎంతో క్రేజ్. ముఖ్యంగా  ధవళేశ్వరం దగ్గర దొరుకుతాయివి. ఈ నదికి ఎదురీదే పులసల గమ్యస్థానం కూడా ధవళేశ్వరం వరకే. అందుకే అక్కడే ఎక్కువగా జాలర్లకు దొరుకుతాయి. తరువాత బొబ్బర్లంక, యానంలో వలలకు చిక్కుతాయి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వీటిని పట్టి... ఒడ్డుకు తీసుకొచ్చిన కాసేపటికే మొత్తం పులసలన్నీ అమ్ముడుపోతాయి. చూసేందుకు చిన్నదే అయినా.. బరువులో మాత్రం తక్కువేం కాదు. చిన్నగా కనిపించే చేప కూడా తక్కువలో తక్కువగా కేజీ తూగుతుంది. రేటు కూడా కళ్లు బైర్లుగమ్మిస్తుంది. ఇంతకు ముందు కిలో రెండు, మూడు వేలున్న ఈ చేప ధర ఇప్పుడు ఏకంగా పదివేలు దాటేస్తోంది. పులస దొరుకుతున్న దాన్ని బట్టి రేటు మారిపోతుంది. ప్రస్తుతం కిలో పులస ధర 7వేల నుంచి 15వేల రూపాయల వరకు  పలుకుతోంది. 


పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర జలాల్లో సంచరించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుంది. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగా ఎదురు వైపు ఈదుకుంటూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుంది. నిజానికి పులసలు రెండు రకాలు. గోదావరి జలాల్లో దొరికేవి ఒకరకమైతే.. ఒరిస్సాలో లభించేవి మరో రకం. అక్కడి నుంచి పెద్దఎత్తున పులస చేపలు మనకు దిగుమతి అవుతాయి. కాకపోతే వాటికీ వీటికీ తేడా ఏంటంటే... ఒరిస్సా పులసలు సముద్రంలోనివి. మన పులసలు... స్వచ్ఛమైన గోదారిలోనివి. అందుకే టేస్ట్‌లో, కాస్ట్‌లో వీటికింత తేడా. ఒడిశాతో పాటు బంగ్లాదేశ్ తీరాల్లో దొరికినా గోదావరి జలాల్లో దొరికిన పులసంత రుచి వాటికి ఉండదని ఆహార ప్రియులు చెబుతుంటారు. 


ఒరిస్సా పులసలు సముద్రంలో దొరుకుతాయి కాబట్టి .. టేస్ట్ తక్కువ కనుక వాటికంత ధర పలకదు. కానీ కొంతమంది వ్యాపారులు.. ఒరిస్సా పులసలనే... గోదారి పులసలుగా నమ్మించి వేల రూపాయలకు అంటగట్టేస్తున్నారు. వీటిగురించి తెలియని కొనుగోలుదారులు... అవే నిజమైన పులసలని నమ్మి తేలిగ్గా మోసపోతున్నారు. గోదావరి నదీలో దొరికే పులస చేపల పొలుసులపై ఎర్రజార ఉంటుందని.. కొనే ముందు దాన్ని పరిశీలించాలని సలహా ఇస్తున్నారు మత్స్యకారులు. పెద్ద పెద్ద షాపులు పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్లే కాదు.. జస్ట్ రోడ్డుపక్కన బుట్టలు పెట్టుకుని అమ్ముకునే వ్యాపారులు రోజుకు... మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ పులస చేపలమ్మి సంపాదిస్తారంటే మీరు నమ్మగలరా? కాని ఇది నిజం. ఈ రేంజ్‌లో బిజినెస్ అవుతుందంటే... దీనికున్న డిమాండ్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమవుతుంది. 





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: