బుడుగు: వీటి వల్ల పిల్లలకు ప్రమాదం.. జాగ్రత్త..!

N.ANJI
నులి పురుగులు వీటిని ఏలికపాములు, నట్టల అని కూడా అంటారు. ఇవి మనిషి శరీరం లోపల ఉంటాయి. ఇవి ప్రమాదకరమైనవి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఎక్కువగా ఆటలు ఆడటం, మల విసర్జన ద్వారా నులి పురుగులు వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. నులి పురుగుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమం. అలాగే భోజనం చేసే ముందు, మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఏదైన ఆహారం వండే సమయంలో కూరగాయలు పూర్తిగా ఉడికేటట్లు చూసుకోవాలి.
ఇక వండిన తర్వాత పదార్థాలపై మూతలు పెట్టడం తప్పనిసరి. అలాగే ఈ నులి పురుగులు పిల్లలపై అధిక ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పిల్లలు శుభ్రత పాటించకపోతే బలహీనులుగా మారే అవకాశాలున్నాయి. వీటి వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలను పీల్చేసి వాటిని గ్రహించే శక్తిని తగ్గిస్తాయి. దీంతో విటమిన్‌ 'ఏ'ను హరింపజేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయితే మరికొన్ని నులి పురుగుల వల్ల పిల్లల్లో ఆకలి మందగించి శక్తిని కోల్పోయేలా చేస్తాయి. మరికొన్ని అతిసారతో పాటు వాంతులు, విరేచనాలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నులి పురుగుల వల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నులి పురుగుల వల్ల పిల్లలు తరుచూగా బరువు తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం కనిపిస్తుంటారు. ఇక పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. అలసటగా కనిపిస్తుంటారు.
అంతేకాదు.. కడుపులో, పేగుల్లో ఏర్పడే నులి పురుగులు సాధారణంగా 300పైగా వివిధ రకాలకు చెందినవిగా ఉంటాయి. వీటిని మైక్రోస్కోప్‌ ద్వారా చూసేందుకు సాధ్యమవుతుంది. అత్యంత చిన్నజీవులుగా మొదలుకొని దాదాపు 35 సెం.మీ వరకు ఉండే అవకాశాలుంటాయి. ఈ నులి పురుగుల్లో ప్రాణాంతకమైన టేప్‌ వర్మ్‌ కూడా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ నులి పురుగుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: