బుడుగు: పరీక్షల సమయంలో పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలా.. ఇలా చేయండి.!?

N.ANJI
పిల్లల ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పరీక్షల సమయంలో చిన్నారులపై ఒత్తిడి పడకుండా, మరో పక్క ఏకాగ్రత చెడకుండా జ్ఞాపకశక్తిని పెంచేందుకు మంచి ఆహారాలను అందించాలి. అయితే ఎలాంటి ఆహారం పిల్లలకు పెట్టాలో చూద్దామా. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల్లో బెర్రీలు ముందు వరుసలో ఉంటాయి. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని పెంచే మూలకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇవి కాకుండా గూస్ బెర్రీలు లేదా ఉసిరి లాంటి ఆహారాలు పరీక్షల సమయంలో పిల్లలకు మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి.

సాధారణంగా చాక్లెట్లంటే పిల్లలకు అమితమైన ఇష్టం. అయితే పరీక్షల సమయంలో మాత్రం వారికి బోర్ కొట్టినప్పుడు తినేందుకు డార్క్ చాక్లెట్ అందించండి. వీటిని పిల్లలకు తినిపిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇందులో ఫ్లావోనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పుష్కలంగా ఉండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మానసిక అలసత్వం, జ్ఞాపకశక్తి లోపం లాంటివి నిరోధిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

పిల్లలకు చిరుతిళ్ల బదులు గింజలు, విత్తనాలు లాంటి వాటిని ఆహారంగా ఇస్తే మంచిది. ముఖ్యంగా శనగలు, కర్బూజా, అవిసె గింజలు వంటి వేయించి ఇవ్వవచ్చు. వీటి వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. అంతేకాకుండా ప్రొటీన్, ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతుంది. ఫలితంగా పిల్లలు ఎక్కువ గంటల పాటు చదువుపై శ్రద్ధ పెట్టగలరు. గుడ్లు మెదడు ఆరోగ్యాన్ని మంచి ఆహారం. ఇందులో సెలినియంతో పాటు ఓమేగా-3, పోషకాలు ఉన్నాయి. ఫలితంగా నాడీ సంబంధిత ఆరోగ్యానికి ఇవి మేలు చేకూరుస్తాయి. ముఖ్యంగా ఉడికించిన గుడ్లు, తెల్ల సొన, ఆమ్లెట్లను రెగ్యులర్ గా వారికి అందించండి.

ఆకుపచ్చ కూరగాయలు మాత్రమే కాకుండా ఎరుపు, ఆరెంజ్ కలర్ కూరల్లో మంచి పోషకాలుంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కఠినమైన పరీక్షలు లేదా ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో పిల్లలకు ఈ కూరగాయలను ఇవ్వడం వల్ల ఆరోగ్యం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా ఏకాగ్రత కోల్పోకుండా ఉంటారు. అంతేకాకుండా వీటిని రెగ్యులర్ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందించడంలో ఎంతో సహాయపడతాయి.

తృణధాన్యాలైన బ్రౌన్ రైస్, గోధుమ, పప్పు దినుసులు లాంటి వాటిలో విటమిన్-బి దొరుకుతుంది. అంతేకాకుండా ఖనిజలవణాలు, గ్లూకోజ్ తగినంత లభ్యమవడం వల్ల మెదడు సక్రమంగా పనిచేస్తుంది. వీటిని రెగ్యులర్ గా పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి తగినంత శక్తి లభిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఓట్ మీల్ ప్రధానమైంది. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటిలో విటమిన్-ఈ, పొటాషియం, జింక్ తో పాటు మెదడుకు మంచి చేసే పలు పోషకాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: