బుడుగు: చిన్నపిల్లలు తినే ఆహారం 'ఉగ్గు' ఎలా తయారు చేయడం ఎలానో తెలుసా..?
పసి పిల్లలకి తల్లి పాలను మించిన ఆహారం ఏదీ లేదని మనకందరికీ తెలుసు. మరి పిలల్లకు పాలతో పాటు ఎలాంటి పోషకాహారం ఎప్పటినించి, ఎలా తినిపించాలి అన్నది తల్లుల ప్రశ్న. పాపాయి తల నిలిపి, నోట్లో కదలికలు, నోరు చెంచా కోసం తెరవటం, మింగటం తెలిసిన తరువాత తినిపించడం మొదలుపెట్టాలి.
సాధారణంగా ఐదు-ఆరు నెలలకి ద్రావకం లాగానో, మెత్తటి పదార్ధం అంటే గుజ్జు లాగానో చేసి చిన్న చిన్న మోతాదులలో తినిపించాలి. ప్రతి శిశువు శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక్కొక్క ఆహారం రెండు రోజులు తినిపించి, వాళ్లకి అలర్జీలు, పడక పోవడాలు ఇలాంటివి వస్తున్నాయేమో నని జాగ్రత్తగా గమనించాలి. తరువాతనే మరో రకం ఆహారం పరిచయం చెయ్యాలి. రెండు-మూడురకాల ఆహారాలు ఒక్కసారిగా పరిచయం చెయ్యకుండా ఉంటే మంచిది ఎందుకంటే పిల్లలకు ఏ ఆహారం పడింది,ఈ ఆహారం పడలేదో మనకి తెలియాలి కదా.
పసిపిల్లలకు ఎటువంటి ఆహారం పెడితే మంచిది, వాటిని తయారుచేసే విధానం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం .పాపాయి ఆరు నెలలు దాటాక తల్లి పాలు తాగుతున్నా మధ్యలో నెమ్మదిగా ఘన ఆహారం చాలా కొద్దిగా తినిపించవచ్చు. పగలు ఒక్కోసారి పాలు బదులుగా ఘన ఆహారం ప్రారంభించండి.ఆ ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండేలా చూసుకుంటే మరి మంచిది. చిన్నపిల్లలకు ఉగ్గు ఇంట్లోనే చక్కగా తయారుచేసుకోవచ్చు.దీనిని పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు.
కావలసిన సామగ్రి:
బియ్యం 1కప్పు, కందిపప్పు పావు కప్పు, సెనగ పప్పు పావు కప్పు, పెసర పప్పు పావు కప్పు, పెసలు పావు కప్పు, బాదం, జీడిపప్పు ఒక పావు కప్పు, వేరుశనగ పలుకులు (పల్లీలు) పావు కప్పు.
తయారీ విధానం:
బియ్యం, పప్పులు అన్నీ బాగా కడిగి, ఎండలో ఒక క్లాత్ పై ఆరబెట్టాలి. బాగా ఆరాక, బాణలిలో వేసి చిన్న మంట మీద వేయించాలి. కమ్మని వాసన వస్తూ, బంగారు రంగులోకి మారాక వాటిని చాల్లార్చి మిక్సీలో వేసుకుని పొడిగా చేసుకోవాలి. తర్వాత ఆ పొడిని ఒక గాలి దూరని సీసాలో దాచుకోవాలి.రోజూ మధ్యాహ్నం భోజనం సమయానికి ఒక గ్లాస్ వేడి నీళ్ళకి ఒక స్పూన్ పొడిని ఉండలు లేకుండా కొంచెం నీరు పోసి బాగా కలిపి పొయ్యి మీద కాగుతున్న నీటిలో పోసి ఈ ద్రవాన్ని ఉడికించాలి.అందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి పొయ్యి ఆపివేయాలి. తర్వాత చల్లారాక కొంచెం నెయ్యి వేసి బుజ్జాయికి తినిపించాలి.ఈ ఉగ్గును పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.