మంచి స్నేహితులు.

Durga
జన్నారపు అడవిలో నివసించే తాబేలు, ఎలుక, కొంగ చాలా మంచి స్నేహితులు. అవి రోజూ ఆడుతూ, పాడుతూ ఉండేవి- దాహం వేసినప్పుడల్లా అక్కడే ఉన్న చిన్న చెరువుకు వెళ్ళేవి. అక్కడ తాబేలు గెంతుతూ, కొంగ ఈత కొడుతూ, ఎలుక స్నానం చేస్తూ, ఆనందంగా గడిపేవి. అయితే ఒక సంవత్సరం వర్షాలు లేవు- ఎండలు మండిపోయాయి. ఆ చిన్న చెరువులో నీళ్లు, ఒక్కసారిగా ఎండిపోయాయి. కొంగకు, ఎలుకకు, తాబేలుకు చాలా దాహం వేసి, ఎప్పటిలాగానే పరిగెత్తు కుంటూ చెరువు దగ్గరికి వచ్చి చూస్తే ఏముంది?- చుక్క నీళ్ళు లేవు! "ఆగండి, నేను చూస్తాను" అని చెరువు మధ్యలో సూటిగా ఒక బొరియను త్రవ్వింది ఎలుక. అయినా, ఎంత లోతు పోయినా మట్టిలో తేమ తప్ప, నీళ్ళు ఉండే సూచనలే కనిపించలేదు. నీళ్ళు లేక మూడూ త్వరలోనే చాలా నీరసించి పోయాయి. కొంగయితే మరీ కదల్లేని పరిస్థితికి చేరుకున్నది. స్నేహితులిద్దరితోనూ అది అన్నది-"ఓ నేస్తాల్లారా! నేను చాలా నీరసించిపోయాను. నాకు నీళ్ళతోబాటు తినేందుకు ఇంత ఆహారం కూడా అవసరం. మీరు ఎవరైనా నాకు కొంచెం ఆహారం, ఇన్ని నీళ్ళు తెచ్చిపెట్టండి, దయచేసి" అని. తాబేలు ఎలుక ఆలోచించాయి. ఎలుక తాబేలుతో‌ అన్నది- "నేను పడమర వైపుకు వెళ్తాను; నువ్వు తూర్పు వైపుకు వెళ్లు- ఎక్కడైనా చెరువులు కనిపిస్తే తిరిగి వచ్చి ఎలాగో ఒకలాగా కొంగను తీసుకెళ్దాం, ఇద్దరం" అని. తాబేలు 'సరే' అన్నది. రెండూ అడవంతా తిరిగి వెతకటం మొదలు పెట్టాయి. అంతలో ఎలుకకు ఒక పావురాల గుంపు కనిపించింది. వాటిని చూడగానే ఎలుక భయపడి దాక్కున్నది కొంతసేపు. అయితే అవేవీ ఎగరటం లేదు- ఎంత సేపు చూసినా నేలమీదే తిరుగుతున్నాయి.  "ఎందుకిలా?" అని చూసిన ఎలుకకు నేలంతా పరచుకున్న వల ఒకటి కనిపించింది. అది పావురాలతో అన్నది- "మీరంతా పాపం, వలలో చిక్కుకున్నట్లున్నది. నన్ను ఏమీ చెయ్యమని మాట ఇస్తే నేను ఈ వలను కొరికి మిమ్మల్ని కాపాడేందుకు ప్రయత్నించగలను" అని. పావురాలన్నీ సంతోషంగా "మా పాలిట దేవుడిలాగా వచ్చావు. మమ్మల్ని కాపాడు; నీకు ఏ పని కావాలంటే అది చేసిపెడతాం, మేం" అన్నాయి. అప్పుడు ఎలుక వలను కొరికి తెంపివేయగానే పావురాలన్నీ దానికి ధన్యవాదాలు తెలుపుకున్నాయి. "నాకు ఈ ధన్యవాదాలు వద్దు- మా మిత్రుడు కొంగ చావు బ్రతుకుల్లో ఉన్నది. మరొక మిత్రుడు తాబేలు, నేను నీళ్లకోసం అడవంతా వెతుకుతున్నాం. మీకు తెలిసి ఎక్కడైనా ఒక చెరువు ఉంటే చెప్పండి చాలు" అన్నది ఎలుక వాటితో. "అయ్యో! దానిదేమి భాగ్యం?! మేముండే చోటనే నిజానికి ఒక పెద్ద చెరువు ఉన్నది. దానిలో‌ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. మిమ్మల్ని ముగ్గురినీ మేం‌ అక్కడికి తీసుకెళ్తాం" అని పావురాలు ఎలుక వెంట వచ్చాయి. ఆలోగా తాబేలు కొంగ దగ్గరికి చేరుకున్నది. దానికి పాపం చెరువు దొరకనేలేదు. "నాకు ఏమీ కనిపించలేదు" అని అది చెబుతుండగానే అక్కడికి ఎలుక, పావురాలు వచ్చి చేరుకున్నాయి. "మా మీద కూర్చోండి! మేం తీసుకెళ్తాం మిమ్మల్ని!" అని పావురాలన్నీ‌ రథం మాదిరి నిల్చున్నాయి. కొంగ, ఎలుక, తాబేలులను ముగ్గురినీ మోసుకొని కొద్ది సేపటిలోనే అవి ఒక పెద్ద చెరువును చేరుకున్నాయి! నీటితో నిండి, ఎండలో తళతళలాడుతున్న ఆ చెరువును చూడగానే మిత్రులు ముగ్గురికీ‌ ప్రాణం లేచివచ్చినట్లు అయింది. ఆనాటినుండీ అవి, పావురాలు అన్నీ కలసి సంతోషంగా బ్రతికాయి. 'ఎండిపోయిన చెరువు పుణ్యమా' అని చాలామంది మిత్రులయ్యారు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: