సెప్టెంబర్ 17 విలీన దినోత్సవమేనా..?

MOHAN BABU
బిజెపి తెలంగాణలో కాగా వేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. హిందూ, ముస్లింల విభజన రాజకీయాలను వేడెక్కిస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని కోరుతోంది. తెలంగాణ గంగా, జమున మేలుకలయికగా  వర్ధిల్లిన చరిత్రను బీజేపీ అధ్యయనం చేయాలి. హైదరాబాద్ రాష్ట్ర చారిత్రక నేపథ్యాన్ని, అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి,విజయవంతంగా పాలించిన నిజాం పాలకుల గురించి తెలిసి కూడా, తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలనడం దురదృష్టకరం. నిజాం చివరి కాలంలో కొన్ని అసాంఘిక శక్తులు భూస్వాముల తో కలిసి రజాకార్ల ఉద్యమానికి పునాది వేశాయి. వారే హైదరాబాద్ రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించారు. కమ్యూనిస్టులు,ఆంధ్రుల తో కలిసి హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పేరుతో ఒక సంస్థను స్థాపించారు.

అసఫ్ జహీల ఈ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం వరకు హిందూ భూస్వాములు,పటేల్ లు దేశముఖ్ లు పాలించేవారు.శాంతిని నెలకొల్పడానికి పోలీసులు, సైన్యం సరిపోకపోతే నిజాం భారతదేశ ప్రభుత్వ సహాయాన్ని కోరారు. 1947 నవంబర్ లో స్టాండ్ స్టిల్ ఒప్పందం జరిగింది. నిజాం విదేశీయుడు కాదు, పాలకుడు కాదు, దక్కన్ రాష్ట్రం విదేశీ పాలకుల చేతుల్లోనూ లేదు. కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 18 ని విలీన దినంగా ప్రకటించింది. సుందర్ లాల్ కమిటీ ప్రకారం 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు తెలంగాణ ప్రాంతంలో కానీ, హైదరాబాద్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కానీ యుద్ధ పరిస్థితులు లేవు. భారత సైన్యం అకస్మాతుగా దాడి చేసింది. ఫలితంగా సుమారు రెండు లక్షల మంది మరణించారు. ఈ మారణహోమానికి పోలీసు యాక్షన్ అని పేరు పెట్టారు. వాస్తవంగా ఇది మిలటరీ యాక్షన్ అనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాలుగు వేల మంది కమ్యూనిస్టులను ఆపరేషన్ పోలో పేరుతో చంపేశారు. 1950 జనవరి 25 న భారత ప్రభుత్వం నిజాం ను రాజ్  ప్రముఖ్ గా నియమించింది. 1950 జనవరి 16 కు ముందు హైదరాబాద్ రాష్ట్రం నిజాముదని, భారత ప్రభుత్వనిది కాదని 1951 లో సుప్రీంకోర్టు తీర్పు వినిపించింది. 1948 తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ విమోచన దినం లాంటి నినాదాల ఉనికే లేదు.

  ఈ నినాదానికి చారిత్రక నేపథ్యం కానీ,రాజకీయ ప్రాముఖ్యత గాని లేదు.కేవలం ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడానికి నిజాంను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో కొన్ని శక్తులు ఈ నినాదం ఎత్తుకున్నాయి. నిజానికి తెలంగాణ ఏర్పడిన 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలి. ఆ రోజు నుంచి నాలుగున్నర కోట్ల తెలంగాణ వాసులకు ముక్తి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: