సినిమా జగతి మరవని మహానటి సావిత్రి... నేడు జయంతి
20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే. ఒక్క రోజులోనో, సిఫార్సులతోనో ఆమెకు వేషాలు రాలేదు. అతి ప్రయాసతో, ప్రతిభతో సినిమాల్లో వేషాలు సంపాదించుకున్నారు. స్డూడియోల చుట్టూ తిరిగి, నిర్మాతల కార్యాలయాల మెట్లు ఎక్కిదిగుతూ పడరాని పాట్లు పడ్డారు. విజయవాడ నుంచి రెండు సంవత్సరాల పాటు మద్రాసుకు వ స్తూపోతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఒకవైపు నాటకాలు వేస్తూ, కాస్తోకూస్తో డబ్బు సంపాదించుకుని, ఆ డబ్బుతో మద్రాసుకు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించారు. 1948 ఆగస్టులో మద్రాసుకు తొలిసారిగా వచ్చి 1950లో చిన్నాచితకా వేషాలు వేశారు. తర్వాత మెల్లగా నిలదొక్కుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి ఆమెను పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.