క‌రోనా రావ‌ద్దంటే చుయింగ‌మ్ తినాలంటా..!

Paloji Vinay
మ‌రోసారి క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాచుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భూతం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. కొవిడ్ భూతం త‌గ్గుతుంద‌ని సంబ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో మ‌రోవేరియంట్ వేగంగా విరుచుకుప‌డుతోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పుడు 41 దేశాలకు పైగా వ్యాప్తిచెందింది.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 721 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక ద‌క్షిణాఫ్రికా త‌రువాత అమెరికాలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇండియాలో కూడా ఈ కొత్త వేరియంట్ వేగంగా విస్త‌రిస్తోంది.. కేసులు పెరుగిపోతున్నాయి.

మూడు రోజుల క్రితం ఎంట‌రైన ఒమిక్రాన్ తొలిరోజే బెంగ‌ళూరులో 2 కేసులు.. త‌రువాతి రోజు గుజ‌రాత్‌లో 1, ముంబైలో 1 కేసు, ఢిల్లీలో ఒక‌టి వెలుగు చూసింది. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారిని నివారించ‌డానికి దేశ వ్యాప్తంగా అనేక ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. క‌రోనాను నిలువ‌రించ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగా తాజాగా ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌యోగం వెలుగులోకి వ‌చ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారికి నోటిలోనే ముకుతాడు వేయ‌గ‌ల చుయింగమ్‌ను అభివృద్ది చేస్తున్నారు అమెరికా శాస్త్ర‌వేత్త‌లు. వ్యాక్సిన్, పిల్స్ వ‌చ్చినా క‌రోనా కొత్త వేరియంట్‌లు విరుచుకు ప‌డుతున్నాయి.

చుయింగ‌మ్‌తో  క‌రోనాకు చెక్‌పెట్టొచ్చా అంటే అవున‌నే అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. క‌రోనా సోకిన వ్యక్తుల్లోని లాలాజ‌లంలో అధిక స్థాయిలో వైర‌స్ ఉంటుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అందువ‌ల్ల అమెరికా ప‌రిశోధ‌కులు ఓ చుయింగమ్‌ను రూపొందించారు. దీని సాయంతో నోటిలోని వైర‌స్ వ్యాప్తిని త‌గ్గించొచ్చ‌ని అంటున్నారు. క‌రోనా సోకిన వ్య‌క్తి తుమ్మిన‌ప్పుడు లేదా ద‌గ్గిన‌ప్పుడు వైర‌స్ ఇత‌రుల‌కు వ్యాప్తి చెందుతుంది. దీంతో చుయింగమ్ వేసుకోవ‌డం ద్వారా నోట్లో ఉన్న వైర‌స్ క‌ణాల‌ను బంధించి ఉంచుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.

 కాగా, దీనికి సంబంధించి క్లినిక‌ల్ ట్రయ‌ల్‌కు అనుమ‌తి పొందే దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఈ పరిశోధ‌న కోసం యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్‌వేనియా క‌రోనా బాధితుల నుంచి న‌మునాలు సేక‌రించి ప్ర‌యోగాలు చేసింది. అయితే, ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్‌ల‌లో చూయింగ‌మ్ ఏ మేర‌కు ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: