మహిళా చదువుల మాలిక.. సావిత్రిబాయిని మరువలేమీకా..!

MOHAN BABU
బహుజన సమాజంలోని పురుషులు కూడా చదువు నేర్చుకో కూడదని బ్రాహ్మణ వాద మత గ్రంథాలు శాసించిన రోజులవి. స్త్రీల దుస్థితి గురించి వేరే చెప్పనవసరం లేదు. అసలు ధర్మశాస్త్రాల్లోని సారాంశాన్ని వదిలి దళిత, బహుజన స్త్రీలకే కాదు, బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీలు కూడా చదువుకోవడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. ఆ సమయంలో మహిళల పాలిట వేగుచుక్కలా పుట్టుకొచ్చింది సావిత్రిబాయి. 1831, జనవరి 3 న మహారాష్ట్ర, సతారా జిల్లా నాయగావ్ లో  లక్ష్మీబాయి, ఖండోజీ దంపతులకు సావిత్రి జన్మించింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందాన సావిత్రి పుట్టుకతోనే ఎన్నో మంచి లక్షణాలు అలవడ్డాయి. చక్కని రూపురేఖలతో ఉండే సావిత్రిబాయి చిన్నతనం నుంచి ఆమె మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉండేది. చురుగ్గా, చలాకీగా ఉంటూ తన పనులతో తెలివైన బాలిక అనిపించుకుంది.

 నిరక్షరాస్యత తో పాటు, అజ్ఞానం, మూఢ నమ్మకాలు బహుజన సమాజాన్ని చిత్రహింసలు పెడుతున్నాయి. ఆరేళ్లకు ఆడపిల్లలకు, పదేళ్లకు మగ పిల్లలకు పెళ్ళి చేయకపోతే అప్పటి సమాజం వారిని చిన్నచూపు చూసేది. తప్పనిసరి పరిస్థితుల్లో 9 ఏండ్లకే సావిత్రిని, 12 ఏండ్ల జ్యోతిరావుకు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటికే జ్యోతిరావుపూలే క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకుంటున్నారు. ఆయన అలా చదువుకోవడం ధర్మ విరుద్ధమని బ్రాహ్మణ సంప్రదాయవాదులు భావించేవారు. ఈ విమర్శలు శృతిమించడంతో తట్టుకోలేని తండ్రి అతన్ని బడి మనిపించాడు. 1842లో పూలే తిరిగి స్కూల్ కి వెళ్లారు. సావిత్రి కూడా ఎందుకు చదువుకోకూడదు అని పూలే ఆలోచించారు. స్వయంగా తానే సావిత్రికి చదువు నేర్పడం ప్రారంభించారు. భర్తను అనుసరిస్తూ సావిత్రి మెల్లమెల్లగా మరాఠీ,ఇంగ్లీష్ చదవడం, రాయడం నేర్చుకున్నారు. భావితరాలకు సరైన మార్గం చూపించగల ఒక ఆదర్శ మూర్తి సావిత్రి భాయి చరిత్రకెక్కేందుకు వేసిన తొలి అడుగు ఆమె చదువు నేర్చుకోవడం. సావిత్రిబాయి పూలే దంపతులు మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు అంటరానితనం నిర్మూలన,స్త్రీ సమస్యలు పరిష్కారం కోసం సావిత్రి తొలి మహిళా మండలి ప్రారంభించారు. సామాజిక సేవకు సహాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. అదే సమయంలో సావిత్రిబాయిని విమర్శించే వారు అధికంగానే ఉండేవారు.1896లో రాష్ట్రంలో పెద్ద కరువు వచ్చింది.వేలాది మంది నీరు ఆహారం లేక మరణించారు.

ప్రభుత్వం ద్వారా రిలీఫ్ వర్క్ జరిగేందుకు సావిత్రిబాయి విశేష కృషి జరిగింది. ఈ అకాల కరువు నుంచి ప్రజలు తేరుకోకముందే పూణేలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. వ్యాధి కంటే ఎక్కువగా సైనికుల బాధకు ప్రజలు విలవిలలాడి పోయారు. అలాంటి భయానక పరిస్థితుల్లో సావిత్రిబాయ్ చేపట్టిన సేవా చర్యలను అక్కడి ప్రజలు ఈనాటికీ చెప్పుకుంటారు. విశ్రాంతి లేకుండా సేవ చేయడం వల్ల సావిత్రి అనారోగ్యం పాలయ్యారు. ప్లేగు  కూడా సోకడంతో 1897 మార్చి 10న సావిత్రిబాయి మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: