ఆఫ్‌లైన్ విద్యా బోధనకు గైడ్‌లైన్స్ ఫాలో మస్ట్!
స్కూళ్లలో హాస్టళ్లలో ప్రతి విద్యార్థితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది మాస్క్ వాడకం తప్పనిసరి అనే నిబంధనను మాత్రం కచ్చితంగా అమలు చేయబోతున్నారు. తరగతి గదులు, విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి భౌతిక దూరం పాటించేలా స్థానికంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ప్రాథమిక విద్యను సైతం ప్రారంభిస్తుండటంతో గతంలో బెంచ్‌కు ఎలా ముగ్గురు నలుగురు కూర్చున్నారో... ఈసారి కూడా అలానే కూర్చొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ జలుబు దగ్గు ఉంటే ఇంటి వద్దే ఉంచేలా పేరెంట్స్‌కు సూచనలు చేయడంతో పాటు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి టెస్ట్‌లు నిర్వహించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
ఇక సోషల్ వెల్ఫేర్ పరిధిలోని హాస్టళ్లలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైతే వెంటనే కలెక్టర్లకు సమాచారం అందిచాలని, మిషన్ భగీరథ పైపులైన్ లేని పాఠశాలలకు తక్షణమే పంచాయతీ, మున్సిపల్ శాఖల సహకారంతో ఆ సౌకర్యాన్ని వెంటనే తీసుకోవాలని ఆదేశించింది. ఈనెల 30లోపు బడులను నిర్వహించేందుకు మొత్తం వ్యవస్థను సిద్దం చేసే బాధ్యతలను డీఈఓలకు విద్యాశాఖ అప్పగించింది. ఈనెల 30లోపు విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకుంటే వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని కూడా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితుల్లో స్కూళ్లకు విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులకు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉటంకించింది. ఇందుకోసం ఆఫ్‌లైన్ విద్యాబోధన కోసం జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ హెచ్చరించింది.