ఫీజు డబ్బులు ఇస్తాం.. చదువుకుంటారా..!

స్వంతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇంకా నిరక్షరాస్యత దేశాన్ని పీడిస్తూనే ఉంది. అసలు బడి ముఖం చూడని పసివాళ్లు కొందరైతే... మధ్యలో చదువు ఆపేసేవాళ్లకూ కొదవు లేదు. పేదరికం.. చదువులపై అవగాహన లేకపోవడం.. ఇందుకు కారణం అవుతున్నాయి. అయితే అలాంటి వారిని చదువు దిశగా అడుగులు వేయించేందుకు ఓ ప్రయత్నం జరగబోతోంది. పాఠశాల విద్య పూర్తికాకుండానే బడి మానేసిన వారిని మళ్లీ చదువుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.

ఇందుకోసం కేంద్రం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. చదువుకుంటే రూ. 2వేల రూపాయలు సాయం చేయబోతోంది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. 16-19 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.  దూరవిద్య విధానంలో పది, ఇంటర్‌ చదవాలనుకునే వారికే ఈ అవకాశం. వీరికి సమగ్ర శిక్ష అభియాన్‌  కింద ఏడాదికి రూ.2 వేల మేర ప్రోత్సాహం అందిస్తారు. ఈ రూ.2 వేల సాయాన్ని తొలిసారిగా ఈ విద్యా సంవత్సరంలోనే అమలు చేస్తారు.  

మరో కండిషన్ ఏంటంటే.. ఈ మొత్తాన్ని ప్రవేశ రుసుం, పరీక్ష ఫీజు, కోర్సు మెటీరియల్‌ కోసమే ఖర్చు చేయాలి. అయితే.. ఈ రూ.2 వేలు ఎలా ఇవ్వాలన్న దానిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల చేతికి ఇస్తే వాటిని ప్రవేశం పొందకుండానే ఇతర ఖర్చులకు వాడుకుంటారు. అందుకే ఈ సొమ్ము సార్వత్రిక విద్యాపీఠానికి ఇవ్వాలని ఓ ఆలోచన కూడా ఉంది. లేదా.. డీఈఓలకు ఇవ్వాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డీఈఓల ఆమోదం ద్వారా జాతీయ సార్వత్రిక విద్యాపీఠం.. ఎన్‌ఐఓఎస్‌ కానీ.. రాష్ట్రాల సార్వత్రిక విద్యాపీఠంలో  చేరేవాళ్లకు ఈ ఆర్థిక సాయం వర్తింపజేయొచ్చు.

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠంలో ఈ విద్యా సంవత్సరానికి పది, ఇంటర్‌ ప్రవేశాలు ఈ వారంలో ప్రారంభం అవుతాయి.  ఈ కొత్త ఆర్థిక సాయంపై రూల్స్ వస్తే.. వేల మంది ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం సార్వత్రిక విద్యాపీఠంలో ఓసీ విద్యార్థి పదో తరగతి చదవాలంటే రూ.1600 వరకు ఖర్చవుతోంది. ఇంటర్‌ విద్యకు ఏడాదికి రూ.1850 ఖర్చవుతోంది.  కేంద్రం రూ.2 వేల సాయం అందిస్తే ఈ ఫీజుల భారం విద్యార్థులకు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: