ఇక‌పై ఆ విద్యార్థులకు నో ఆన్‌లైన్ క్లాసులు..!!

Kavya Nekkanti

ప్రస్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబ‌రులో చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు శ‌ర‌వేగంగా వ్యాప్తిచెందింది. ఇక ఈ క‌రోనా భూతానికి వ్యాక్సిన్ లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో.. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు విద్యాసంస్థలు కూడా మూతపడ్డాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది.

 

దీంతో లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కొన్ని విద్యాసంస్థలతో పాటు కొందరు తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ద చూపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పాఠశాలల యాజమాన్యాలు ఆన్ లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చూడాలని పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోనూ ఇదే తరహాలో ఆ ప్రభుత్వం విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ, ఆన్‌లైన్ పాఠాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 

ఇకపై కేజీ నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను రద్దు చేయాలని నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా.. కేజీ నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలను వెంటనే ఆపేయాలని, దీంతో పాటు ఆన్‌లైన్ తరగతుల పేరిట ఫీజు వసూలు చేయడం వెంటనే ఆపేయాలని కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి ఎస్.సురేష్ వెల్ల‌డించారు. ఆన్‌లైన్ తరగతులు, భౌతిక తరగతులకు ప్రత్యామ్నాయంగా ఉండలేవని అందరూ అభిప్రాయపడినట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. కాగా, క‌ర్ణాట‌క‌లో  జూన్ 25 నుంచి జూలై 4 వరకు పదో తరగతి పరీక్షల నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: