కరోనా కష్టకాలంలోనూ ఈ ఉద్యోగాలకు డిమాండే వేరు..!!
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 38 లక్షలకు పైగా ప్రజలకు కరోనా సోకగా.. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2.60 వేలను మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక తలలు పట్టుకుంటున్నాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి.
ఇక ఈ రక్కసిని కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా ఎందరో ప్రజలు తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు కంపెనీలు మూత పడడంతో ఉద్యోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ కరోనా కష్టకాలంలోనూ కొన్ని ఉద్యోగాలకు మహా డిమాండ్ ఉంది. వీరి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు నిపుణులు. అవేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫుల్ స్టాక్ డెవలపర్: యూజర్ల బిజినెస్‌తో పాటు టెక్నికల్ అంశాల్లో సహకారం అందించడంలో ఫుల్ స్టాక్ డెవలపర్‌ది కీలక పాత్ర పోషిస్తుంది. పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ లాంటి డేటాబేస్ లాంగ్వేజ్‌లో పట్టు ఉండాలి. అనేక సంస్థల్లో వీరికి మంచి డిమాండ్ ఉంటుంది.
నెట్వర్క్ ఆర్కిటెక్ట్: కంప్యూటర్ నెట్వర్క్స్‌ని ప్లాన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం నెట్వర్క్ ఆర్కిటెక్ట్ పని. డేటా, వాయిస్, కాల్స్, వైర్‌లెస్ నెట్వర్క్స లాంటివన్నీ ఇందులోనే ఉంటాయి. నిరంతరాయంగా కనెక్టివిటీ, నెట్వర్క్ ఎర్రర్స్‌ని ట్రబుల్ షూట్ చేయడం లాంటి బాధ్యతలన్నీ వీరివే. యాక్సెంచర్, టెక్ మహీంద్రా లాంటి టెక్ సంస్థల్లో వీరికి భలే డిమాండ్ ఉంది.
క్లౌడ్ కంప్యూటింగ్: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఐటీ కంపెనీలన్నీ క్లౌడ్ పైన ఎక్కువగా దృష్టిపెట్టాయి. వీలైనంత త్వరగా క్లౌడ్‌లోకి మారాలని నిర్ణయించుకున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ ఉన్నవారికి గూగుల్, ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది.