బీఆర్ఎస్ కంబ్యాక్ పై భారీ ప్లాన్ సిద్ధం చేసిన కేసీఆర్..? మామూలుగా లేదు గా..!
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై సైలెంగ్ గా ఉన్న ఆయన ఇక ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి, బీఆర్ఎస్ మళ్లీ బలపడాల్సిన అవసరం తదితర అంశాలపై కేసీఆర్ సమగ్రంగా విశ్లేషించారు.
ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవాలు, సంస్థాగ అంశాలు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, తదితర సంబంధిత అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉండాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణ బద్దులమై మరింతగా బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణకు రక్షణ కవచమని చెప్పారు. పార్టీ రజతోత్సవ వేడుకలో తెలంగాణ సమాజమంతా భాగస్వాములేనని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అంసతృప్తి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం వరంగల్ సమీపంలో సువిశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని ప్రకటిస్తామన్నారు.
దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవ్వాళ కష్టాల్లో ఉందన్నారు. ఈ సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం వుందని స్పష్టం చేశారు.
వరంగల్ బహిరంగ సభ అనంతరం.. పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలుపరచాలని సమావేశంలో నిర్ణయించారు.