
ఎన్టీఆర్ ట్రస్టు కు పవన్ కళ్యాణ్ భారీ విరాళం? భువనేశ్వరి, బాలయ్య, బాబుపై షాకింగ్ కామెంట్స్?
విజయవాడ జనసందోహంతో ఇంత కళకళలాడడం ఆనందంగా ఉందన్న పవన్ కల్యాణ్.. నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నారా భువనేశ్వరికి నా ధన్యవాదాలు.. ఆహ్వాన పత్రిక పంపిస్తేనే వచ్చేవాడిని, ఫోన్ చేయాల్సిన అవసరం లేదని ఆమెతో అన్నాను.. ఆమెపై అంత అపారమైన నమ్మకం నాకు. కష్టాలు, ఒడిదొడుకులొచ్చినా.. బలమైన సంకల్పంతో ఆమె నిలబడ్డం దగ్గరి నుంచి చూశాను అన్నారు.
బాలకృష్ణ ప్రేమగా నన్ను.. బాలయ్యా అనే పిలువు అంటారు. కానీ..నాకు ఎప్పుడూ ఆయనను సార్ అనే పిలవాలనిపించేంత అపారమైన గౌరవం.. ఎవరినీ లెక్కచేయని వ్యక్తిత్వం. తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఒకటి కాదు, రెండు కాదు.. తరాలు మారినా ప్రేక్షకులను ఎప్పుడూ తన నటనతో మెప్పించే గొప్ప వ్యక్తి బాలకృష్ణ. ఆయన మామూలు బాలకృష్ణ కాదు.. పద్మభూషణ్‌గా గుర్తించడం ఆనందదాయకం అంటూ బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా వేలాది మందికి సాయం అందించాలని కోరుకుంటున్నానన్న పవన్ కల్యాణ్.. చాలా సైలెంట్‌గా సహాయం చేసుకుని వెళ్లిపోయే ట్రస్ట్ ఇది. దేశవిదేశాల నుంచి ప్రముఖ వైద్య నిపుణులొచ్చి వారి సేవలు అందించి వెళ్లిపోతుంటారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా.. ట్రస్ట్ ద్వారా ప్రతిఒక్కరి గుండెల్లో సజీవంగా ఉన్నారు. ఒక మంచి పని ఆరంభించం.. దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని. అలాంటిది 28 ఏళ్లుగా సేవలందిస్తూ వెళ్లడం చాలా గొప్ప విషయం అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షతే చూస్తాం కానీ.. ఆయన సాయం చేసే ధోరణి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బలంగా కనిపిస్తుందన్న పవన్ కల్యాణ్.. నా దగ్గరికి వచ్చే చాలామందికి సాయం చేయమంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లేఖ రాస్తే, ఆయన నేతృత్వంలోని అధికారులు స్పందించే విధానం గొప్పగా ఉంటుంది. ట్రస్ట్‌లను నిర్వీర్యం చేయాలని చూసే వ్యక్తులు ఎక్కువుంటారు. కానీ.. అలాంటి వారి నుంచి కాపాడుకుంటూ 28 ఏళ్లుగా కొనసాగించడం గొప్ప విషయం. ఈ ట్రస్ట్ ఇలాగే మరో వందేళ్లయినా కొనసాగాలన్నారు.