
మళ్లీ రెచ్చిపోయిన హైడ్రా.. ఈసారి ఏం కూల్చారంటే?
హైడ్రా నోటీసులను సవాల్ చేస్తూ ప్రకృతి రిసార్ట్స్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన కోర్టు...కోమటికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రాను ఆదేశించింది. 30 రోజుల సమయం కావాలని, తామే తొలగించుకుంటామని ప్రకృతి రిసార్ట్స్ ప్రతినిధులు హైకోర్టుకు తెలిపారు. 30 రోజులు గడిచినా అక్రమ నిర్మాణాలు తొలగించకపోవడంతో రంగంలోకి దిగిన హైడ్రా ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ ను కూల్చివేసింది.
అలాగే హైదరాబాద్ నగర శివారు మున్సిపాల్టీల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్ పైనా హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. హోర్డింగ్స్ తొలగించాలని సూచించినా వినిపించుకోని ఏజెన్సీలపై మండిపడ్డారు. వెంటనే హోర్డింగ్స్ ను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
శంషాబాద్, కొత్వాల్ గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఉన్న 53 భారీ హోర్డింగ్స్ ను హైడ్రా తొలగించింది. 35 యూనిపోర్స్, 4 యూనిస్ట్రక్షర్స్, ఇళ్లపై ఏర్పాటు చేసిన 14 హోర్డింగ్స్ ను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. అనుమతులు ఉన్న హోర్డింగ్స్ ను తొలగించమని స్పష్టం చేసిన రంగనాథ్.... అనధికారికంగా ఏర్పాటు చేసిన వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.