వైసీపీకి బ్రహ్మాస్త్రం దొరికినట్లే గా..? ఇక కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లేనా..!
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చేశాయి. అప్పటివరకూ దుర్బేద్యంగా కనిపించిన వైసీపీ కాస్తా 11 సీట్లతో దారుణ పరాజయాన్ని చవిచూడగా..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 సీట్లు గెల్చుకుని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత గత ఆరు నెలల్లో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో కూటమే ఇప్పుడు జగన్ కు మంచి అస్త్రం ఇచ్చింది.
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ నాయకులు, నేతలు గళమెత్తుతున్నారు. ఇలా అసందర్భంగా టీడీపీ నాయకులు కొత్త డిమాండ్ ను వరుసగా తెరపైకి తెస్తున్నారంటే దాని వెనుక అధిష్టానం ఉంటుందన్న చర్చ ఎలాగో జరుగుతోంది. అదే సమయంలో కూటమిలో మిత్రపక్షం జనసేనలో ఇది కాక పుట్టిస్తోంది. అలాగే విపక్ష వైసీపీకి అయితే వరంగా మారుతోంది.
పవన్ కళ్యాణ్ కు పోటీగా లోకేష్ ను చంద్రబాబు డిప్యూటీ సీఎం చేస్తారా లేదా అన్న చర్చను పక్కనబెడితే అసలు ఈ చర్చ తెరపైకి రావడం వైసీపీకి ప్లస్ అన్న వాదన మొదలైంది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఎలాంటి విభేదాలు లేకుండా పక్కా సమన్వయంతో మందుకు సాగిపోతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారణంగా కూటమికి బీటలు వస్తాయని అంచనాలు వేసిన వైసీపీకి ఇప్పుడు ఆ అవసరం లేకుండా టీడీపీయే ఆ పని చేస్తోందన్న భావన మొదలైంది.
లోకేష్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టాలన్నా పవన్ కళ్యాణ్ అభిప్రాయం తీసుకోవడం చంద్రబాబుకు తప్పనిసరి. అయితే ఇప్పటికే పవన్ కు ప్రోటోకాల్ విషయంలో అన్ని విధాలుగా గౌరవిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు తనకు పోటీగా లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం ఇస్తామని ప్రతిపాదిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఏ క్యాడర్, లీడర్ల పేరు చెప్పి లోకేష్ ను డిప్యూటీ చేస్తామని టీడీపీ ప్రతిపాదిస్తుందో అదే లీడర్ల పేరు చెప్పి పవన్ వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే కూటమికి బీటలు మొదలైనట్లే అని వైసీపీ అంచనా వేసుకుంటోంది.