తిరుపతి ఘటనపై జగన్ రాజకీయం చేస్తున్నారా?
వీరందరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జగన్.. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని.. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడతో పాటు రూ.5 లక్షల సాయం అందించాలని.. తొక్కిసలాట ఘటనను తక్కువ చేసి చూపుతూ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ మార్చాలని.. డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసులు కాకుండా ప్రమాదవశాత్తు జరిగినట్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని.. అందుకే బీఎన్‌ఎస్ సెక్షన్–194 బదులు సెక్షన్–105 నమోదు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదూ భక్తీ లేదన్న మాజీ సీఎం జగన్.. అందుకే శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేశారన్నారు. సీఎం చంద్రబాబు వైఫల్యం వల్లే ఇప్పుడు ఈ దారుణం జరిగిందని.. ఈ పాపం ఊరికే పోదని.. చంద్రబాబు సహా బాధ్యులందరికీ దేవుడి మెట్టికాయలు ఖాయమని మాజీ సీఎం జగన్ అన్నారు.
రాష్ట్ర చరిత్రలో తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయిన ఘటన గతంలో మనం ఎప్పుడూ చూడలేదన్న మాజీ సీఎం జగన్.. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటన్నది అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగింది. ఘటన జరగడానికి కారణాలు ఏంటన్నది ఆలోచన చేయాలన్న మాజీ సీఎం జగన్.. వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని లక్షల మంది వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారని.. ఆరోజు వైకుంఠద్వార తెరుస్తారని అందరికీ తెలుసన్నారు. లక్షల మంది దర్శనానికి వస్తారని తెలిసినప్పటికీ టీటీడీలో ఎందుకు ప్రోటోకాల్స్ పాటించలేదన్నారు. టీడీపీ నేతలు మాత్రం విపత్తు వేళ జగన్ రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.