ముంచుకొస్తున్న కొత్త వైరస్‌.. చంద్రబాబు కీలక ఆదేశాలు?

చైనా వంటి దేశాల్లో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు ముందుజాగ్రత్తగా రెడీ అయ్యారు.  వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదు కావటంపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు చేశారు. రాష్ట్రంలో ఈ కేసులు పెరగకుండా చూడాల్సిందిగా ఆదేశించారు.

హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 2001 నుంచి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్టుగా సీఎంకు తెలిపిన ఉన్నతాధికారులు.. ఇప్పటి వరకూ ఏపీలో ఎలాంటి హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని సీఎంకు వివరించారు.
ఆక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాంటి శ్వాసకోస వ్యాధులు, ఇన్ ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం చంద్రబాబు.. మైక్రోబయాలజిస్ట్ లు, పీడియాట్రీషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్సు కమిటీ నియమించాలని ఆదేశించారు.

హెచ్ఎంపీవీ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిర్వహణకు సంబంధించి టాస్క్ ఫోర్సు నుంచి సలహాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. హెచ్ఎంపీవీ సాధారణ వైరస్ గా సీజనల్ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్ లను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. హెచ్ఎంపీవీ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు.
 
తక్షణం 3 వేల టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.  హెచ్ఎంపీవీ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఔషధాల లభ్యతపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. ప్రస్తుతం రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు , 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వీటి సరఫరాను పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శానిటైజర్లను కూడా సిద్ధం చేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: