పవన్‌ కూడా వారసత్వ రాజకీయాలేనా.. ఏంటో ఈ సమర్థన?

జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి రానుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. నాగబాబు నాతో పాటు సమానంగా పని చేశారంటున్న పవన్‌ కల్యాణ్‌.. ఆయనకు మంత్రి పదవి వస్తే తప్పేంటి అని ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని.. పార్టీ కోసం నాగబాబు నిలబడ్డారని పవన్‌ కల్యాణ్‌ వెనకేసుకొచ్చారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదు.. పనిమంతుడా కాదా అన్నదే చూడాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొస్తున్నారు.

గతంలోనూ నాగబాబును ఎంపీగా ప్రకటించి, మళ్లీ తప్పించామని పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేసుకున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారని.. ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. మీ సోదరుడికే మరో మంత్రి పదవి ఇప్పించుకోవడం నెపోటిజం కాదా అని అడిగితే ఇదే విషయంలో జగన్‌ను మీరెందుకు అడగలేదు అంటూ మీడియానే జగన్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

కేవలం పవన్‌కల్యాణ్‌ను మాత్రమే అడుగుతారా అంటూ చిరచిరలాడారు. మాకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య, మేం సొంతంగా ఎదిగారమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మా తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నాగబాబు త్వరలో ఎమ్మెల్సీగా ఎంపికవుతారని.. మంత్రి అనేది తర్వాత చర్చ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నాగబాబు త్యాగం గుర్తించి ముందుగా రాజ్యసభ అనుకున్నామని.. రాజ్యసభ కుదరలేదు కాబట్టి.. ఎమ్మెల్సీ అనుకున్నామని.. పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.

అలాగే మంత్రి కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదని.. దుర్గేష్‌ పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చామని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. రాజకీయాల్లో కులం కాదు.. పనితీరే ప్రామాణికమని పవన్‌ కల్యాణ్‌ సూత్రీకరించారు. మొత్తం మీద తాను కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్న అభిప్రాయాన్ని పవన్ తీరు బయటపెడుతోంది. పార్టీలో పని చేసే నాయకులు ఇంకా ఎవరూ లేరన్నట్టుగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై విమర్శలు కొసాగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: