ఇంత లో ఎంత మార్పు? నాడు వద్దనుకున్న నాయకులే నేడు జగన్ కి దిక్కయ్యారా..?
మాజీ సీఎం జగన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడినా.. గౌరవప్రదమైన సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 2019లో అయితే ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 2024లో మాత్రం 11 స్థానాలకు పరిమితం అయింది. దీంతో పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు.
ఆ నష్టం నుంచి ఎలా అధిగమించాలి అన్న దానిపై జగన్ పెద్ద ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వద్దనుకున్న నాయకులను ఇప్పుడు చేరదీయాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఆ కొద్దిపాటి నాయకులను వైసీపీలోకి రప్పించుకోవాలని చూస్తున్నారు జగన్. గతంలో అదే నాయకులు వైసీపీలోకి వస్తామంటే పెద్దగా ఆసక్తి చూపని జగన్.. ఇప్పుడు అవసరం కోసం వారిని చేరదీసే పనిలో పడ్డారు. కానీ ఐదేళ్ల కిందట అదే నాయకులు రాయభారం పంపినా స్పందించలేదు జగన్.
అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు అప్పట్లో ప్రయత్నం చేశారు. కానీ జగన్ నుంచి అంత ఆసక్తి కనిపించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సాకే శైలజానాథ్ సభ్యుడిగా ఉండేవారు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాక.. పీసీసీ పగ్గాలు అందుకున్నారు. అయితే ఆది నుంచి జగన్ విషయంలో వ్యతిరేక భావనతోనే ఉండేవారు.
2019 ఎన్నికల్లో జగన్ గెలిచేసరికి ఆ పార్టీలో చేరాలని భావించారు. కానీ జగన్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో భారీ ఓటమి ఎదురయ్యేసరికి శైలజానాథ్ అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు శైలజా నాథ్ తో వైసీపీ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదం అయినట్లు సమాచారం. త్వరలో ఆయన వైసీపీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2004, 2009లో పోటీ చేసిన శైలజనాథ్ రెండు సార్లు విజయం సాధించారు. చాలామంది నేతలు వైసీపీతో పాటు టీడీపీలో చేరారు. కానీ శైలజానాధ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఇప్పుడు జగన్ పిలవడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.