ఇండియా ముక్కలు అవుతుందా? రాహుల్ కింకర్తవ్యం!
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి అనుకున్న లక్ష్యాలను సాధించకుండానే ఇబ్బందులో పడుతోందా అన్న చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో భారీ టాస్క్ తో ఫీల్డ్ లోకి దిగిన ఇండియా కూటమి అనుకున్నది సాధించలేకపోయింది.
ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ వరసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోలేక ఆపసోపాలు పడుతోంది. అనేక చోట్ల జూనియర్ పార్టనర్ గా మారిపోయింది. కాంగ్రెస్ కి సోలోగా ఉన్న స్టేట్స్ లో పెద్దవి కర్ణాటక, తెలంగాణా తప్ప మరేమీ లేవు అంటే ఆశ్చర్యమే. ఇండియా కూటమికి దూరంగా జరిగి తమ సొంత ఉనికిని చాటుకోవాలని అందులోని పార్టీలు ఆరాటపడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విడిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించడం ఇండియా కూటమిలోని లుకలుకలకు ఒక ఉదాహరణ అంటున్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఇండియా కూటమి తాజా పెర్ఫార్మెన్స్ పట్ల పెదవి విరుస్తున్నారు. తాను పూనుకుని ఇండియా కూటమి ఏర్పాటు చేస్తే ఈ రోజున దానిని నడిపిస్తున్న వారికి ఆ నిర్వహణ చేతకాకపోతే తాను ఏమి చేయగలను అంటూ ఆమె విమర్శలు చేశారు. తనకు బెంగాల్ ని విడిచి వెళ్ళడం ఇష్టం లేదని కానీ ఇండియా కూటమికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తే కచ్చితంగా ఇక్కడ నుండి దానిని నడిపిస్తాను అని ఆమె అంటున్నారు
మమతా బెనర్జీకి ఇండియా కూటమి పగ్గాలు ఇవ్వాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కోరుతున్నారు. మమతకు పగ్గాలు ఇస్తేనే మోడీ ప్రభుత్వం మీద ఇండియా కూటమి మీద గట్టిగా పోరాటం ఇండియా కూటమి చేయడానికి వీలు అవుతుందని ఆయన వాదిస్తున్నారు.
ఇక ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీ అయితే తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కి ఇండియా కూటమి నాయకత్వం ఇవ్వాలని కోరుతుంది. దేశంలో సీనియర్ నేతగా ఉన్న లాలూ అయితేనే ఎండీయే దూకుడుకు అడ్డుకట్ట వేయగలరని అంటున్నారు.
మధ్య ప్రదేశ్, హర్యానా ఎన్నికల్లో తమను పట్టించుకోలేదని వామపక్షాలు కూడా ఇండియా కూటమి పట్ల అసహనంగా ఉన్నాయని అంటున్నారు. ఇలా అందులోని కీలక పార్టీలు అన్నీ ఎవరి కారణాలతో వారు టచ్ మీ నాట్ అంటున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి మనుగడ సాగిస్తుందా సాగిస్తే ఎలా అన్న చర్చ మొదలైంది.