అసెంబ్లీ ఎగ్గొట్టడానికి కొత్త సాకులు చెబుతున్న జగన్? జనం నమ్ముతారా?
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యకరంగా ఉందని జగన్ అన్నారు. సరస్వతి పవర్ భూముల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారని, 1000 ఎకరాల్లో పట్టా భూములున్నాయని, కేవలం 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, అయితే ఆ భూమిని సరస్వతి పవర్ తీసుకోలేదన్న విషయాన్ని సర్వే చేసిన ఎమ్మార్వోనే చెప్పారని జగన్ గుర్తు చేశారు. ఆనాడు గ్రామసభలో రైతులు అడిగిన రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొన్నామని గుర్తు చేశారు.
సరస్వతి పవర్ కట్టకపోవడానికి టీడీపీ, కాంగ్రెస్ నేతలే కారణమని…ఆ కేసుల వల్లే ఆ భూములను ఈడీ అటాచ్ చేసిందని జగన్ ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందని, ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని అని, ఒక దళిత హోం మంత్రిని కాదని జగన్ అన్నారు.అసెంబ్లీలో వైసీపీ సభ్యులకు మైక్ ఇవ్వడంలేదని, అటువంటప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమిటని జగన్ ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులే నా స్పీకర్లు, మీడియా సమక్షంలోనే ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని జగన్ అన్నారు.
ఏది ఏమైనా మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రశ్నిస్తాను అన్న జగన్ పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీడియా ముందు అసెంబ్లీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకని చురకలంటిస్తున్నారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది కాబట్టి అసెంబ్లీకి అన్ని పార్టీల తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు వెళుతుంటారని అంటున్నారు.