సంపద సృష్టి ఏమో గానీ.. అప్పుల్లో మాత్రం జగన్ ని మించి పోతున్న కూటమి ప్రభుత్వం?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో పది రోజుల్లో ఐదు నెలలు పూర్తి అవుతుంది. దాంతో ఈ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అన్నది పూర్తి అవుతుందని అంటున్నారు. ఈ అయిదు నెలల పనితీరు బేరీజు వేయడం టూ ఎర్లీ అని భావించినా ఇపుడున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలు వారి తొందర తనం వంటివి పరిగణనలోకి తీసుకున్నపుడు ప్రభుత్వం ఇంకా కొంత వెనకబడింది అన్న భావన కలుగుతుంది.
సూపర్ సిక్స్ హమీల విషయంలో ఇంకా అడుగులు పూర్తిగా పడలేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పటికి రెండు హామీలు నెరవేర్చారు. అవి ఒకటి పెన్షన్లను పెంచడం, రెండవది ప్రతీ పేద ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించడం. ఇక మిగిలిన హామీల విషయం చూడాల్సి ఉంది.
అభివృద్ధి విషయం చూసుకుంటే అమరావతి రాజధానిలో కదలిక అయితే మొదలైంది అన్న భావన అయితే ఉంది. పోలవరం పనులకు కేంద్రం నుంచి నిధులు తెప్పించారు. అయిదు నెలలలో కూటమి ప్రభుత్వం సంపద సృష్టి చేయాలని ఆశించడం కూడా తొందరపాటే అవుతుంది. కానీ అదే సమయంలో అప్పులను ఎంతో కొంత నియంత్రించినా అది కూడా సంపద సృష్టిలో భాగమే అన్న భావన ఉంది. కానీ ఆ విధంగా అయితే పరిస్థితి లేదు అని అంటున్నారు.
కేవలం అయిదు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పులు అక్షరాలా 54 వేల కోట్లు. ఇప్పటిదాకా 47 వేల కోట్లను కూటమి ప్రభుత్వం అప్పుగా తెచ్చింది. ఇపుడు మరో ఏడు వేల కోట్లకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. అంటే మొత్తం అర లక్ష కోట్ల అప్పు దాటింది అన్న మాట.
ఇక ఏపీలో సంక్షేమ పధకాలు పూర్తిగా అమలు చేయలేదు కానీ అన్నీ చేస్తే అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అప్పులను తగ్గిస్తే సంపద సృష్టించినంత మేలు అని సగటు జనం అంటున్నారు. కానీ అప్పులతోనే ఏపీ బండిని కూటమి సర్కార్ లాగుతోంది. మరి ఇప్పట్లో అప్పుల బెడద ఏపీకి తప్పుతుందా అంటే ఏమో ఆ మంచి రోజులు నిజంగా వస్తాయా అన్న అనుమానంలో ఏపీ పౌరులు ఉన్నారు