తిరుమల వెంకన్న పవర్ ఫుల్.. తప్పు చేస్తే పుట్టగతులు ఉండవ్?
తిరుమల వెంకటేశ్వరస్వామి విషయంలో ఎవరూ తప్పులు చేయరనే అంటారు. ఒకవేళ పొరపాటున చేసినా దానికి తగిన ప్రాయశ్చిత్తం తీసుకోవాల్సిందే. లేకపోతే.. ఆ దేవదేవుడు తప్పక శిక్షిస్తాడు అన్నది సగటు జనం నుంచి సంపన్నుల వరకూ ఉంది. వెంకన్న ఆశీస్సులు ఎంత దయగా ఉంటాయో ఆయన ఆగ్రహం అంత కఠినంగా ఉంటుంది అని భక్తులు అంతా నమ్ముతారు.
కలియుగ దైవంగా పూజిస్తారు. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన ఉంటాడని ఆధ్యాత్మిక పరులు పురాణాల నుంచి సేకరించిన విషయాన్ని చెబుతూ ఉంటారు. నిజంగా అదే నిజం కూడా వెంకన్న కరుణ ఎంత చల్లగా ఉంటుందో తెలియజెప్పే పురాణేతిహాసాలు ఉన్నాయి. అలాగే తప్పు కనుక చేశారా అవే కళ్లలో నిప్పులు కురిపించి భస్మీపటలం చేస్తారు అని కూడా పురాణాల్లో ఉంది.
అందుకే ఎవరూ వెంకన్న జోలికి తెలిసి తెలియక పోరు. ఎంతో భక్తి ప్రవత్తులతో ఆ స్వామిని కొలుస్తారు. మొక్కులు చెల్లించుకోవడానికి నానా తిప్పలు పడి కూడా కొండలెక్కి వస్తారు. మరి అంతటి మహిమాన్వితుడి పేరు మీద రాజకీయాలు జరగుతున్నాయి. ఆ స్వామిని అడ్డం పెట్టుకొని డైలాగ్ వార్ జరుగుతోంది. తప్పు జరిగింది అని ఒక పార్టీ తమ హయాంలో జరగలేదు. జరిగి ఉంటే అది మీ హయాంలోనే అని మరో పార్టీ వాదించుకుంటున్నాయి. నిజంగా తప్పు జరిగిందా లేదా అన్నది ఇప్పుడు భక్తుల మదిని దొలిచేస్తున్న ప్రశ్న.
జరిగితే కనుక ఆ తప్పులు చేసిన వారిని వ్యవస్థలు ఏ విధంగా శిక్షించినా లేకపోయినా వెంకన్న మాత్రం తప్పకుండా శిక్షిస్తారు అని కూడా భక్త జనం నమ్ముతున్నారు. అంతేకాదు తప్పు జరగకపోయినా జరిగింది అని ప్రచారం చేసి వెంకన్న ప్రతిష్టకు భంగం కలిగించినా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. దీని మీద సాధులు ఆధ్యాత్మిక పరులే కాదు రాజకీయ పార్టీల నేతలు ఇదే విధంగా మాట్లాడుతున్నారు. వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా అధోగతే అని మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. వెంకన్నతో ఎవరూ సరదాకు అయినా రాజకీయాలు చేయరాదు అని అన్నారు.