చంద్రబాబు ఆలోచించుకోవాలంటున్న దేశం నేతలు?

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలి నుంచే టీడీపీ శ్రేణులపై దాడులు ప్రారంభమయ్యాయి. ముప్పేటా కేసులు, ప్రశ్నిస్తే దాడులు ఇలా ఒకటేమిటి చాలా విధాలుగా వేధింపులకు గురి అయ్యారు. గత ఐదేళ్లుగా కేసులకు ఎదురొడ్డి వైసీపీ పెట్టిన ఇబ్బందులను తట్టుకొని 2024 ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు యుద్ధమే చేశారు. ప్రస్తుత అసెంబ్లీలోనే 80శాతం మందిపై కేసులు ఉన్నాయంటే ఇక కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతుంది. వైసీపీ రేంజ్ లో రివేంజ్ రాజకీయాలు చేయలేకపోతున్నామనే బాధ టీడీపీ కార్యకర్తల్లో ఉంది. సోషల్ మీడియా వేదికగా వారు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉండగా.. తమపై గత వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అనేక కేసులు పెట్టి ఇరికించారని వారు తెగ బాధపడుతున్నారు.

వైనాట్ కుప్పం నినాదం ఇచ్చిన వైసీపీ అధినేత..అందుకు తగినట్లు క్షేత్రస్థాయిలో పావులు కదిపారు. వీటిని తట్టుకొని చంద్రబాబుకి అనుకూలంగా పార్టీ క్యాడర్ పనిచేసింది. ఓ విషయంలో చెప్పాలంటే వీరిని చంద్రబాబు అభినందించాల్సిందే. అయితే కుప్పంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అక్కడ వైసీపీ ఖాళీ అవుతోంది. వీరంతా టీడీపీలో చేరేందుకు పోటీ పడుతున్నారు.

వచ్చే ఏడాది రాష్ట్రంలో లోకల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పంకు చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఐదుగురు కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ కోసం ఆది నుంచి వైసీపీ నేతల దాడులకు, వ్యూహాలకు ఎదురొడ్డి చంద్రబాబుని గెలిపించిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ వైసీపీ నాయకులే ప్రజా ప్రతినిధులు అయితే.. వీరికి అన్యాయం చేసినట్టే కదా అని ప్రశ్నిస్తున్నారు. వీరంతా తమకు ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తారు అని.. కానీ తాజా చేరికలతో వారికి మొండి చెయ్యే చూపినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ చేరికల విషయంలో చంద్రబాబు ఓ సారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.. సొంత పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: