జగన్‌ సింగిల్‌ డిజిట్‌ మాటలు.. బాబు నిజం చేసేలా ఉన్నారే?

మొన్న జగన్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌ సీట్లే వస్తాయన్నారు. ఆయన ఆ మాట చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. అసలు ప్రభుత్వం పనే ప్రారంభించకుండా అలాంటి మాటలు జగన్ మాట్లాడటం సరికాదన్న వాదన వినిపించింది. సరే.. ఏదో పార్టీ వాళ్లను ఊరడించడం కోసం జగన్ అలా మాట్లాడి ఉండొచ్చని సరిపెట్టుకోవచ్చు. కానీ చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు చూస్తే.. జగన్ మాటలను చంద్రబాబు నిజం చేస్తారేమో అనిపిస్తున్నాయి.

అలాంటి నిర్ణయాల్లో తాడేపల్లి సీతానగరంలోని వైసీపీ కార్యాలయం కూల్చివేత ఒకటి. వైసీపీ ఆఫీసు కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చి వేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నారని.. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం జగన్ కట్టబెట్టారని చెబుతున్నారు. అక్రమ నిర్మాణం పై వైసీపీకి సీఆర్డీఏ నోటీసులు ఇచ్చిందని.. చెబుతున్న అధికారులు ఈరోజు ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు.

గతంలోనూ జగన్ ఇదే దూకుడు ప్రారంభించారు. ప్రజావేదిక కూల్చివేశారు. అప్పట్లో టీడీపీ గగ్గోలు పెట్టింది. అలాంటి దూకుడు నిర్ణయాల కారణంగానే జగన్‌ 11 సీట్లకు పరిమితం అయ్యారు. కానీ ఇదంతా తెలిసి కూడా చంద్రబాబు సర్కారు కూడా జగన్ మార్గంలోనే వెళ్తుందా అనిపిస్తోంది. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని అధికారులు ఇవాళ కూల్చివేశారు. ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైసిపి కడుతున్న పార్టీ నిర్మాణాన్ని కూల్చివేశామని ఎంటిఎంసి అధికారులు చెబుతున్నారు.

అధికారం అండతో తాడేపల్లిలో 202/A1 సర్వే నెంబర్లోని 2ఎకరాల ఇరిగేషన్ భూమి వైసీపీ కార్యాలయానికి జగన్ కేటాయించుకున్నారని.. 2 ఎకరాల్లో భవనాలు కట్టి మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా.. నోటీసులు ఇచ్చి.. దాన్ని వారు నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా దూకుడా అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతలు ప్రారంభిస్తే జగన్ తెచ్చుకున్న చెడ్డపేరే చంద్రబాబు కూడా తెచ్చుకుంటారనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: