ప్రత్యేక హోదా.. జగన్‌ పార్టీకి ఊపిరి పోస్తుందా?

ఎక్కడ పోగోట్టుకున్నారో అక్కడే వెతుక్కునే పనిలో పడ్డారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.  2019లో ప్రత్యేక హోదా అంశంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ అధినేత… ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కేంద్రంలో మన మద్దతుపై ఆధారపడే ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అని చేతులు ఎత్తేశారు. ఇప్పుడు మళ్లీ ఆ నినాదమే జీవం పోస్తుందని ఆశతో ఉన్నారు. అందుకే తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకి తీసుకు వచ్చారు. ఎమ్మెల్సీలతో సమావేశమైన మాజీ సీఎం..  ఎన్నికల ఓటమిపై నిరుత్సాహ పడొద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చెబుతూనే ప్రత్యేక  హోదాపై మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసింది.  

వైసీపీ అధికారంలో ఉన్నన్నీ రోజులు స్పెషల్ స్టేటస్ పై ఏనాడు నోరు మెదపని జగన్.. 22 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంట్ లో చర్చించింది లేదు. ఆందోళన చేసింది లేదు. కానీ అధికారం కోల్పోగానే ప్రత్యేక హోదాపై మళ్లీ రాజకీయాలు స్టార్ట్ చేశారనే విమర్శలు మొదలయ్యాయి. టీడీపీ ప్రస్తుతం ఎన్డీయేలో కీలకంగా ఉందని.. ఇప్పటికైనా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని.. ఇప్పుడు సాధించకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు.  తద్వారా టీడీపీని ఇరకాటంలో  నెట్టి లబ్ధి పొందాలని ఆయన చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలంతా ఇదే రాగం అందుకున్నారు.

మొత్తానికి అయితే జగన్ మున్ముందు ఇదే అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చుకోవాలని చూస్తున్నట్లు అర్థం అవుతోంది. అయితే జగన్ మాటలను ప్రజలు ఏ మేర విశ్వసిస్తారో అనేది తేలియాల్సి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే హోదా అనేది ముగిసిన అధ్యాయమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏపీకి ఇస్తే.. మరోవైపు బిహార్ సిద్ధంగా ఉందని.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదని వారు కొట్టి పారేస్తున్నారు. మరి ఈ అంశం జగన్ కు ఏ మేర మైలేజ్ తీసుకువస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: